ప్రస్తుతం దేశం మొత్తం నిప్పుల కుంపటి లాగా మారింది. అన్ని రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే గత కొన్ని ఏళ్లుగా దేశంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా.. ఇలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయి రెడ్డి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల గురించి తాజాగా చేసిన ట్వీట్.. అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలతో పాటే జరుగుతాయి. అయితే గత ఎన్నికలు 2024 ఏప్రిల్, మే నెలల్లో జరిగాయి. దీంతో తదుపరి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం.. 2029 ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలను కొన్ని నెలల ముందుకు జరపాలంటూ.. విజయసాయిరెడ్డి ఒక కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన వేడిగాలులు సతమతం చేస్తున్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇంకా కేవలం మూడేళ్ల సమయం ఉంది. దీంతో ఎన్నికలు వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఉండటంతో వాటిని కాస్త ముందుగానే నిర్వహించాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్న తరుణంలో.. ఎన్నికల సమయంలో నిర్వహించే ర్యాలీలు, సభలు, రాజకీయ ప్రచారాల్లో లక్షలు, కోట్ల మంది ప్రజలు గుమిగూడాల్సి వస్తుంది. దీంతో తీవ్రమైన ఎండలు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని విజయసాయిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎన్నికల షెడ్యూల్‌ను కొన్ని నెలల పాటు ముందుకు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎక్స్ వేదికగా విన్నపం చేశారు. అయితే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండటంతో.. విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక నెట్టింట మాత్రం ఇది సరైన సూచన అంటూ విజయసాయిరెడ్డిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.