త్రిభాషా విధానంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది, పది తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ విద్యా సంవత్సరం అంటే జులై 2026 నుంచే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. సీబీఎస్‌ఈ ఉత్తర్వుల ప్రకారం.. మూడు భాషల్లో రెండు భారతీయ భాషలై, ఏదో ఒక విదేశీ భాష ఉండాలి. ఈ మూడింటిని అధ్యయనం చేయాలి. అయితే, పది విద్యార్థులకు ఊరట కల్పించిన సీబీఎస్‌ఈ.. మూడో భాషకు బోర్డ్ ఎగ్జామ్ ఉండదని తెలిపింది. విద్యార్థులు భాషాధ్యయనంపైనే దృష్టి సారించేలా.. అనవసర ఒత్తిడి తగ్గించేందుకే ఈ వెసులుబాటు ఇచ్చినట్టు పేర్కొంది. ఆ పాఠశాలల్లో చూపే ప్రతిభ ఆధారంగానే ఈ సబ్జెక్ట్‌కు మార్కులు కేటాయిస్తారు. నూతన జాతీయ విద్యా విధానంలో ఒక భాగం. మూడు భాషలను విద్యార్థులు అభ్యసించాలని ఎన్పీఈ-2020 స్పష్టం చేసింది. వీటిలో రెండు తప్పనిసరిగా భారతీయ భాషలై ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుంది. కానీ, ఈ భాషలను నిర్ణయించుకునే అధికారం మాత్రం రాష్ట్రాలకే అప్పగించింది.మాధ్యమిక స్థాయిలో భారతీయ భాషలు, ఇంగ్లీష్‌తో పాటు జపనీస్, కొరియన్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్‌లను అభ్యసించవచ్చని ఎన్పీఈ- 2020 చెబుతోంది. ఎక్కువ శాతం పాఠశాలల్లో ఇంగ్లీష్‌‌ను విదేశీ భాషగా పరిగణిస్తారు. కాబట్టి ఈ భాషను ఎంపిక చేసుకునే విద్యార్థులు రెండు భారతీయ భాషలను చదవాల్సి ఉంటుంది. రాజ్యాంగ మౌలిక నియమాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం సహా బహుభాషా తత్వాన్ని ప్రోత్సహించి జాతీయ సమైక్యతను పెంపొందించడమే ఈ విధానామని ఎన్పీ నిబంధనలు చెప్తున్నాయి.అయితే, గతంలో తమిళనాడు ప్రభుత్వం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఆరోపించారు. ఈ వివాదం కారణంంగానే సర్వశిక్షాభియాన్ నిధులు తమిళనాడుకు నిలిచిపోవడం తీవ్ర దుమారం రేపింది. కానీ, అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో విజయ్ ఏం నిర్ణయం తీసుకుంటారోననేది ఆసక్తి రేపుతోంది. ఇక, మహారాష్ట్రలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు హిందీని విధిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో మహాయుతి సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.