షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నరసరావుపేట కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పల్నాడు జిల్లాలోని ఎస్టీ విద్యార్థులకు తమ విజ్ఞా్న్ యూనివర్సిటీలో ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఎస్టీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపొద్దని.. విజ్ఞాన్ వర్సిటీలో ఉచితంగా చదివిస్తామంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పల్నాడు జిల్లాలోని ఎస్టీ విద్యార్థులను ఎంపీ సన్మానించారు. నరసరావుపేటలోని ఎస్.ఎస్.ఎన్ కళాశాలలో జరిగిన అభినందన సభలో ఎంపీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల్లో వివిధ గ్రూపుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఎస్టీ విద్యార్థులను అభినందించి, సత్కరించారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలో ఇంటర్‌లో 600లకు పైగా మార్కులు సాధించిన 287 మంది ఎస్టీ విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచిత విద్యనందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తల్లిదండ్రులు పిల్లల చదువులను మధ్యలోనే ఆపేసే పరిస్థితి రాకూడదని, ధైర్యంగా పైచదువులకు పంపాలని లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు.ఇంటర్మీడియట్ పరీక్షల్లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 346 మంది ఎస్టీ విద్యార్థులు పాస్ కాగా.. అందులో 287 మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఈ విషయం జిల్లాకే గర్వకారణమన్న ఎంపీ.. ఇంతటి ఘన విజయానికి కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఎస్టీ కుటుంబాల నుంచి ఒక్కో గ్రామానికి కనీసం నలుగురు చొప్పున చదువుకొని ఉన్నత స్థాయిల్లో స్థిరపడాలనేదే తన కోరికని ఎంపీ తెలిపారు. ఆ నలుగురిని చూసి గ్రామంలోని మరో పది మంది స్ఫూర్తి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్టీ విద్యార్థులు కనీసం డిగ్రీ వరకైనా చదివితే.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులువవుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను డిగ్రీ పూర్తయ్యే వరకు చదివించాలని కోరారు. మరోవైపు నరసరావుపేట పరిసర ప్రాంతాలలోని విద్యార్థుల కోసం ఒక కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా.. ఎంపీ సానుకూలంగా స్పందించారు. నరసరావుపేటలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.