కేరళంలో అంతర్గత ఒత్తిళ్ల నడుమ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసిన కాంగ్రెస్‌కు పొరుగున ఉన్న కర్ణాటకలోని నాయకత్వ మార్పు మళ్లీ తలనొప్పిగా మారింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలపై పార్టీ దృష్టి సారించడంతో తాత్కాలికంగా పక్కనబెట్టిన కర్ణాటక కాంగ్రెస్‌లోని నాయకత్వ పోరు, మరోసారి అంతర్గత చర్చల్లోకి వచ్చే అవకాశం ఉంది. గతేడాది నవంబరులో నాయకత్వ మార్పుపై తీవ్రమైన ఊహాగానాలు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కారణమయ్యాయి. ఆ సమయంలో, కాంగ్రెస్ హైకమాండ్ ఒక ఖచ్చితమైన పరిష్కారానికి రాకుండానే సంక్షోభాన్ని తాత్కాలికంగా నివారించగలిగింది.ఇప్పుడు, కేరళ చిక్కుముడి పరిష్కారం కావడంతో పార్టీ దృష్టి మళ్లీ కర్ణాటక వైపు మళ్లింది. అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య రాజకీయ పోరు మరోసారి తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ, ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ కోసం ఒత్తిడి చేస్తుండగా, శివకుమార్ మాత్రం ముఖ్యమంత్రి కావాలనే తన ఆశలను కొనసాగిస్తున్నారు.ఈ దశలో క్యాబినెట్ విస్తరణ జరిగితే, నాయకత్వ మార్పుపై శివకుమార్ ఆశలను బలహీనపరిచే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో నమ్మకం బలపడుతోంది. ముఖ్యంగా, సిద్ధరామయ్య పరిపాలన, శాసనసభ పక్షంపై తన పట్టును మరింత బలపరుచుకుంటే ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో, సిద్ధరామయ్య వర్గం వేచి చూసే ధోరణిని అవలంబిస్తుండగా, శివకుమార్ వర్గం మాత్రం గతంలో కుదిరినట్లు చెబుతున్న అధికార భాగస్వామ్య అవగాహన గురించి కాంగ్రెస్ నాయకత్వానికి గుర్తుచేస్తోంది.మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ జరిగితే మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేయడం కూడా పార్టీ నాయకత్వంపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో, ప్రభుత్వ స్థిరత్వం, పాల సజావుగా సాగుతుందా? అనేది నిర్ధారించుకోడానికి కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకలోని రాజకీయ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించే అవకాశం ఉంది. కేపీసీసీ కార్యాలయం బయట, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శివకుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వెలిసిన పోస్టర్లు కొత్త ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి. కొన్ని పోస్టర్లలో ఆయనను ‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి’గా పేర్కొనడమే అందుకు కారణం. మైసూరులో, శివకుమార్ మద్దతుదారులు ఆయనను తదుపరి ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ పుట్టినరోజు కేక్‌ను కూడా కోశారు.సిద్ధరామయ్య ఏం కోరుకుంటున్నారు?1. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ2. మంత్రివర్గంలో కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించడం3. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయడం4. ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం5. నాయకత్వ నిర్ణయాన్ని వాయిదా వేసినా ఆయనకు రాజకీయంగా లాభం చేకూరుతుంది.6. గ్రేటర్ బెంగళూరు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు నాయకత్వానికి సంబంధించిన ఏ అంశాన్నైనా వాయిదా వేయడం.డీకే ఉద్దేశం ఏంటి?1. కేపీసీసీ అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన రికార్డు స్థాయి అసెంబ్లీ విజయానికి గుర్తింపు, ప్రతిఫలం2. ఈ పదవీకాలంలో ముఖ్యమంత్రిగా తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి తగినంత సమయం3. ఆయన నాయకత్వంలో కొత్త మంత్రివర్గం4. పదోన్నతి లభిస్తే కేపీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సుముఖత5. అధికార భాగస్వామ్యంపై ఇచ్చిన 'వాగ్దానాన్ని' కాంగ్రెస్ హైకమాండ్ నిలబెట్టుకోవడం.కాంగ్రెస్ హైకమాండ్‌ నిర్ణయాన్ని ఆలస్యం చేయడమే ఇప్పటివరకు అత్యంత సురక్షితమైన రాజకీయ వ్యూహంగా కనిపించింది. అయితే, ఇరు వర్గాలు ఒత్తిడి కొనసాగించడం, రాజకీయ సంకేతాలు వెలువడంతో కాలయాపన చేయడానికి ఆస్కారం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. సిద్ధరామయ్యను సీఎం కొనసాగించినా? డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగించినా? ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏదో ఒక వర్గం నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది.