‘డేవిడ్ రెడ్డి’ ఫేమ్ లక్ష్మణరావు మృతి.. దోషులకు శిక్ష పడాల్సిందేనని మంచు మనోజ్ ట్వీట్

Wait 5 sec.

మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. ఈ చిత్రానికి వర్క్ చేస్తున్న లక్ష్మణ రావు అనే టెక్నిషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మనోజ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. లక్ష్మణ రావు ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన మృతిపై ;అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి దోషులకు శిక్ష పడేలా చేయాలని మనోజ్ కోరారు. లక్ష్మణ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ''మా 'డేవిడ్ రెడ్డి' చిత్ర బృందంలో ఎంతో నిబద్ధతతో, కష్టపడి పనిచేసే సభ్యుడైన మా లక్ష్మణ రావు అన్న విషాద మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది. ఆయన ఎంతో మంచి మనిషి. ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తి. ఇప్పుడు ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం నిజంగా గుండెల్ని పిండేస్తోంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి, నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరిపించాలని కర్ణాటక, తెలంగాణ డీజీపీలను నేను వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. నిజం వెలుగులోకి వచ్చి, దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరుతున్నాను. మొత్తం సినీ పరిశ్రమతో పాటు ఆయన్ను ప్రేమించే వారందరూ దీని కోసమే ఆశిస్తూ, ప్రార్థిస్తున్నారు. ఏ నేరమూ శిక్ష నుంచి తప్పించుకోకూడదు. లక్ష్మణరావు గారికి న్యాయం జరగాలి. ఓం శాంతి'' అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. లక్ష్మణ రావుతో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు.''మా డేవిడ్ రెడ్డి కుటుంబ సభ్యుడు, మా DOP టీమ్ ఎంతో కీలకమైన వ్యక్తి లక్ష్మణ్ అన్న గారి ఆకస్మిక మరణం మాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మా సినిమాలో పెట్టిన కష్టం, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని డేవిడ్ రెడ్డి టీమ్ హృదయపూర్వక నివాళులు అర్పిస్తుంది. RIP లక్ష్మణ్ అన్న'' అని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'డేవిడ్ రెడ్డి' సినిమాకి హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తుండగా.. ఆచార్య వేణు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. అదే టీంలో లక్ష్మణరావు పని చేస్తున్నారు. అయితే ఆయన అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? వంటి విషయాలను చిత్ర బృందం వెల్లడించలేదు. మంచు మనోజ్ కర్ణాటక, తెలంగాణ డీజీపీలను ట్యాగ్ చేయడంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన కేసు అయ్యుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. లక్ష్మణరావు మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.