ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచే ఆఖరి అవకాశాన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ పోగొట్టుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో డిజాస్టర్ షో చేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫలమై గుజరాత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓటమిపాలయింది. ఈ ఓటమితో సీఎస్కే ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ కాగా.. గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్‌కి తోడు.. ఆఖర్లో జోస్ బట్లర్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేయడంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. మొహమ్మద్ సిరాజ్ మొదటి బంతికే సంజూ శాంసన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్‌ను సిరాజ్ ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు. ఆ వెంటనే మాథ్యూ షార్ట్ కూడా వికెట్ కోల్పోయాడు. దాంతో సీఎస్కే పవర్ ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. బాగా ఆడుతున్నాడు అనుకున్న సమయంలో కార్తీక్ శర్మ రనౌట్ కావడంతో సీఎస్కే 63 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. సీఎస్కే దారుణంగా ఓడిపోతుందేమో అనుకున్న సమయంలో శివమ్ దూబే విశ్వరూపం చూపెట్టాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 47 పరుగులు చేసిన దూబేని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ అందుకుని పెవిలియన్‌కు పంపించాడు. శివమ్ దూబే - బ్రెవిస్ 21 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 116 పరుగుల వద్ద శివమ్ దూబే వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అన్షుల్ కాంబోజ్ కూడా తన బ్యాట్‌తో పరుగులు రాబట్టాడు. 8 బంతులు ఆడిన కాంబోజ్ 1 ఫోర్, రెండు సిక్సర్లతో 19 పరుగులు చేసి అవుటయ్యాడు. డివాల్డ్ బ్రెవిస్ 8వ వికెట్ వరకూ క్రీజులో ఉండి కేవలం 10 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు. నూర్ అహ్మద్ 1, స్పెన్సార్ జాన్సన్ 0 పరుగులకే అవుటవ్వడంతో సీఎస్కే 13.4 ఓవర్లలోనే 140 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, రబడా, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఎలిమినేట్ అయింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే 6 మ్యాచ్‌లలో గెలిచి 12 పాయింట్లు సాధించింది. సీఎస్కే మీద ఘన విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో గుజరాత్ క్వాలిఫైయర్ 1లో దాదాపు తన స్థానాన్ని ఫిక్స్ చేసుకుందనే చెప్పొచ్చు.