మస్క్ సంచలన ప్రకటన.. స్పేస్ ఎక్స్‌లో జాబ్ ఆఫర్స్.. ఏఐ అనుభవం అక్కర్లేదు.. ఫాస్ట్‌గా మెయిల్ చేయండి!

Wait 5 sec.

Elon Musk SpaceX Recruitment Tweet: ప్రపంచంలోనే ఎప్పుడూ చర్చనీయాంశంగా మారే.. దిగ్గజ బిలియనీర్ వ్యాపారవేత్త.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు .. మరోసారి అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకున్నారు. ఈసారి టెస్లా కార్ల గురించో.. స్పేస్ ఎక్స్ రాకెట్ల గురించో.. ఎక్స్ (ట్విట్టర్) పోస్టుల గురించో కాదు. ఆయన సంపద గురించి అస్సలు కానే కాదు. ఈసారి ఏఐ గురించి కీలక ప్రకటన చేశారు మస్క్. స్పేస్‌ఎక్స్ కంపెనీ కొత్త విభాగం స్పేస్ఎక్స్ఏఐ డివిజన్ కోసం ప్రపంచ స్థాయి ఇంజినీర్లు, ఫిజిసిస్టుల్ని నియమించుకునేందుకు భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. దీని గురించి స్పేస్‌ఎక్స్ బాస్ అయిన మస్క్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఔత్సాహికులకు ఏఐలో ముందస్తు అనుభవం లేకున్నా సరే.. అసాధారణ టాలెంట్ ఉంటే చాలు అని చెప్పారు.'స్పేస్ఎక్స్ఏఐ కోసం ప్రపంచ స్థాయి ఫిజిసిస్టులు/ఇంజినీర్లను నియమిస్తున్నాం. ఏఐలో జీరో ఎక్స్‌పీరియెన్స్ ఉన్నా సమస్యే లేదు. తెలివైన మనుషులు (స్మార్ట్ హ్యూమన్స్) ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటారు.' అని మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇంకా మీ అసాధారణ నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని చూపే 3 బుల్లెట్ పాయింట్లతో ai_eng@spacex.com కు మెయిల్ చేయాలని సూచించారు. ఇంకా గతంలో ఎప్పుడైనా సంక్లిష్ట సిస్టమ్‌ను నిర్మించి.. దానిని విజయవంతంగా రన్ చేసిన రికార్డ్ ఉంటే వారికి అదనపు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఇంకా మెయిల్‌కు వ్చచే ప్రతి అప్లికేషన్‌ను ప్రాథమిక పరిశీలన తర్వాత తానే స్వయంగా రివ్యూ చేస్తానని మస్క్ ప్రకటించడం విశేషం. ఇలా మస్క్ చేసిన ప్రకటన.. నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సంప్రదాయ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి వాటి నియామక ప్రక్రియలకు ఇది చాలా భిన్నంగా ఉంది. రెజ్యూమేలు, సర్టిఫికేషన్స్, PHD లు సహా ఏళ్ల అనుభవం ఇవన్నీ అక్కడ కీలకంగా ఉంటాయి. కానీ మస్క్ మాత్రం ఇక్కడ డిగ్రీల కంటే సమస్యల్ని పరిష్కరించగలిగే తెలివి, వేగంగా నేర్చుకునే నైపుణ్యం ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. ఇక మస్క్ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ సరదాగా.. 'సైన్స్‌లో B+ గ్రేడ్, JV సాకర్ టీమ్, ఒకేసారి 10 ఓరియో బిస్కెట్లు తినగలను. డోజీకాయిన్ ఓనర్' అంటూ ఫన్నీ రిజ్యూమే పోస్ట్ చేశాడు. ఇంకొందరు.. 'ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఇలా రిక్రూట్ చేస్తుంటే.. మా కంపెనీలు మాత్రం పదేళ్ల అనుభవం అడుగుతున్నాయని' కామెంట్స్ చేశారు. గాజా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి.. 'ఇక్కడ కూడా టాలెంట్ ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల బయటికి రావట్లేదు' అని చెప్పాడు.అయితే ఇక్కడ సడెన్‌గా మస్క్ హైరింగ్ డ్రైవ్ వెనుక పెద్ద బిజినెస్ వ్యూహం ఉందని విశ్లేషకులు, అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ప్రస్తుతం స్పేస్ఎక్స్ ఐపీఓ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. కంపెనీ విలువ సుమారు 1.75 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఐపీఓ కోసం పత్రాలు సమర్పించగా.. అత్యధిక నిధులు సేకరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అటువైపు ఇన్వెస్టర్లు/షేర్ హోల్డర్ల దృష్టి మరల్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మే 21న ఉదయం 10.38 గంటలకు ట్వీట్ చేయగా.. 12 గంటల వ్యవధిలోనే ఆ పోస్టును 33 మిలియన్ల మంది చూడటం విశేషం. ఇలాంటి ప్లానింగ్ మస్క్‌కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. గతంలోనూ ఇలా ఎన్నో వ్యూహాలు రచించి సక్సెస్ అయ్యారు కూడా. అందుకే ఆయన ప్రపంచంలోనే అందరికంటే ఎత్తులో ఉన్నారు.