తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. ప్రాణాంతక వ్యాధులు, అరుదైన ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా శ్రీవారి ప్రత్యేక దర్శనాలకు అనుమతించాలని లాయర్ శ్రీకృష్ణ యశస్వి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. గతేడాది డిసెంబర్‌లో కూడా వినతులు వచ్చాయని.. ఈ రిక్వెస్ట్‌పై నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ఈవోను హైకోర్టు ఆదేశించింది. టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని పిటిషనర్‌కు తెలియజేయాలని కోర్టు సూచించింది.రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులు, గుండె, కిడ్నీ, డయాలసిస్‌తో పాటుగా పలు సమస్యలతో బాధపడుతూ సర్జరీలు చేయించుకున్న అనుమతిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. వీరికి మాత్రమే ప్రత్యేకంగా మెడికల్ కోటా కింద తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారన్నారు. తాను ప్రస్తావించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని చేర్చకపోవడం వల్ల వారు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడలేకపోతున్నారని లాయర్ కోర్టుకు తెలిపారు. వీరంతా తిరుమల శ్రీవారిని దర్శనానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నేషనల్‌ పాలసీ ఫర్‌ రేర్‌ డిసీజెస్‌ 2021 కింద వచ్చే వ్యాధులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారిని కూడా సహాయకుడితో పాటు ప్రత్యేక దర్శనానికి అనుమతించేలా ఆదేశించాలని కోర్టును కోరారు.శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంకు భక్తుల నుంచి ఆదరణహిందూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అలిపిరి సప్త గోప్రదక్షిణ మండపంలో నిర్వహిస్తున్న “శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం”కు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని టీటీడీ తెలిపింది. సనాతన భారతీయ సంస్కృతిలో యజ్ఞ, యాగాదులకు అత్యున్నత స్థానం ఉంది. భక్తుల సంకల్పాలను భగవంతుని సన్నిధికి చేర్చే పవిత్ర వేదికగా ఈ హోమ కార్యక్రమాన్ని టీటీడీ 2023 నవంబరు 23న ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహాశీస్సులతో కొనసాగుతున్న ఈ దివ్య హోమం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా జరుగుతోంది.అత్యంత వ్యయప్రయాసలతో నిర్వహించాల్సిన ఈ హోమాన్ని సాధారణ భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ, భక్తుల కోరిక మేరకు 2025 ఆగస్టు 1 నుండి రోజుకు 200 టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జారీ చేయాలని నిర్ణయించిందన్నారు. టికెట్ పొందిన గృహస్తులు స్వయంగా హాజరై హోమంలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర ఆదేశాల మేరకు రూ.7 కోట్ల వ్యయంతో దాదాపు 500 మంది గృహస్తులు ఒకేసారి పాల్గొనేలా విశాలమైన శాశ్వత యాగశాల నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు.భక్తులకు సులభ దర్శనం కల్పించడమే కాకుండా భగవంతుని అనుగ్రహాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలనే మహోన్నత సంకల్పంతో టీటీడీ ఇప్పటికే శ్రీనివాస కళ్యాణాలు, వైభవోత్సవాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, భజన బృందాలు, అన్నమాచార్య సంకీర్తన ప్రచారం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వంటి అనేక ధార్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. భక్తులు తమ శుభకార్యాలు, జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు వంటి విశేష సందర్భాల్లో శ్రీవారి సన్నిధిలో సంకల్పం చెప్పుకుని ఈ హోమంలో పాల్గొని దివ్య ఆశీస్సులు పొందవచ్చన్నారు.రూ.1600/- చెల్లించి ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులు పాల్గొనే అవకాశం కల్పించారన్నారు. హోమంలో పాల్గొన్న వారికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా కల్పిస్తారన్నారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ టికెట్లను నెల రోజుల ముందుగానే టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in ఆన్ లైన్ లో నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవాలని సూచించారు. హోమం అనేది భగవంతుని ఆరాధనలో అత్యంత పవిత్రమైన మార్గమని, వేద మంత్రాల శక్తితో దైవానుగ్రహం త్వరగా లభిస్తుందని అర్చకులు తెలిపారు. భక్తులందరూ ఈ దివ్య హోమంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ కోరింది.