ఆర్టీసీ అంశంలో తాను వ్యాఖ్యల్ని వక్రీకరించారన్నారు ఆంధ్రప్రదేశ్‌‌ ఆర్టీసీ ఛైర్మన్ కొకనళ్ల నారాయణరావు. కొంతమంది తన చెప్పిన మాటల్ని పూర్తిగా వినకుండా వక్రీకరించడం సరికాదన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తమని.. ఎవరూ ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. దేశవ్యాప్తంగా కేంద్రం కొత్తగా విద్యుత్ బస్సుల్ని అందిస్తోందని.. ఆ బస్సుల్ని ప్రైవేటీకరణ చేస్తోందన్నారు.కేంద్రం ప్రైవేట్ సంస్థల్ని విద్యుత్తు బస్సుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. టెండర్లు దక్కించుకున్న ప్రైవేట్ సంస్థలు పెట్టుబడితో పాటుగా నిర్వహణ, డ్రైవర్లను కూడా నియమించుకుంటారన్నారు . ఆర్టీసీ నుంచి కేవలం కండక్టర్లను మాత్రమే ఇస్తుందన్నారు. ఆర్టీసీనే విద్యుత్తు బస్సులను పూర్తిగా నిర్వహించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారని ప్రస్తావన వచ్చిన సమయంలో తాను చేసి వ్యాఖ్యల్ని పూర్తిగా వినకుండా ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తున్నారని వక్రీకరించడం సరికాదని మండిపడ్డారు. కేంద్రమే ఈ విద్యుత్ బస్సులకు కావాల్సిన ఛార్జింగ్, సబ్‌ స్టేషన్లకు నిధులు కేటాయిస్తోందన్నారు.ఆర్టీసీలో మరిన్ని ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టడం తప్పనిసరి అవుతోందని.. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పడం లేదన్నారు . రాష్ట్రంలో 750 విద్యుత్‌ బస్సులు రాబోయే రెండు నెలల్లో వినియోగంలోకి వస్తాయన్నారు. ఇంధన పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎంతో ఉపయోగంగా ఉంటాయంటున్నారు. కేంద్రం రాయితీ ఇస్తున్నా సరే ఆర్టీసీకి ఈ విద్యుత్ బస్సుల్ని కొనుగోలుచేయడం సాధ్యం కాదన్నారు. ఒక్కో బస్సు ధర ఏకంగా రూ.1.70 కోట్లు ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల బస్సులు ఉంటే.. వాటి బదులు విద్యుత్ బస్సులు తీసుకురావాలంటే ఏకంగా రూ.15వేలకోట్ల వరకు అవుతుందని అంచనాలు ఉన్నాయన్నారు. ప్రైవేటు బస్సులతో ఆర్టీసీపై ఆర్థికభారం తప్పుతుందన్నారు కొనకళ్ల నారాయణరావు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న డీజిల్‌ బస్సులతో పోలిస్తే విద్యుత్‌ బస్సుల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ అన్నారు. మొత్తం మీద ఆర్టీసీ ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న ప్రచరాంతో పాటుగా విద్యుత్ బస్సుల అంశంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సుల్ని తీసుకొస్తే ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరల ప్రభావం ఆర్టీసీపై ఉండదన్నారు కొనకళ్ల నారాయణరావు. అలాగే ప్రస్తుతానికి ఆర్టీసీ టికెట్ల ధరలు పెంచే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ బస్సుకు కిలోమీటరుకు రూ.7.. డీజిల్ బస్సు వల్ల కిలో మీటర్‌కు రూ.16 అవుతుందన్నారు. విద్యుత్ బస్సుల రాకతో ఆర్టీసీపై భారం తగ్గుతుందన్నారు. త్వరలోనే కొత్త విద్యుత్ బస్సులు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కొనకళ్ల నారాయణ తెలిపారు.