ఓ రైతు పెద్ద మనసు చాటుకున్నారు.. తన దగ్గర పనిచేసే కుటుంబాలకు భారీ సాయం అందించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లకు చెందిన సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) కౌలు రైతు.. ఆయన పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. ఆయనకు ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి సర్ ఆర్థర్ కాటన్‌పై అభిమానం. అందుకే తన ఇంటి ముందు కాటన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భాస్కరరెడ్డికి ప్రతి ఏటా కాటన్‌ జయంతి అంటే ప్రత్యేకం.. ఆ రోజు వేదపండితుల ఆశీర్వచనాలతో విగ్రహానికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అలాగే ధాన్యంతో అభిషేకాలు చేయిస్తుంటారు. ఈసారి కూడా కాటన్ జయంతి రోజు అలాగే చేశారు.. పట్టు వస్త్రాలు, ధాన్యంతో అభిషేకాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలతో పాటుగా ఏళ్ల తరబడి తన దగ్గర పనిచేస్తున్న పది కుటుంబాలకు సాయం కూడా చేశారు. మొత్తం 20మందికి ఒక్కొక్కరికి రూ.రెండేసి లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేశారు పెద్ద మనసు చాటుకున్నారు. రైతుల వ్యవసాయంలో శ్రామికుల కష్టాన్ని గుర్తించి వారికి అండగా నిలబడలానే ఉద్దేశంతోనే ఈ సాయం చేసినట్లు భాస్కరరెడ్డి చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరంతా తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారని.. అందుకే వారికి ఈ సాయం చేశానంటున్నారు.అస్సాం టీమ్ పర్యటనమరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ-పట్టాదారు పాసుపుస్తకాలు దేశానికే ఆదర్శమని అస్సాంకు చెందిన ప్రతినిధులు ప్రశంసించారు. అస్సాం భూరికార్డులు, సర్వేశాఖకు చెందిన టీమ్ ఏపీలో మూడ రోజులు పర్యటించింది. రాష్ట్రంలో మొత్ం 12 రకాల భద్రతా ప్రమాణాలతో రూపొందించిన పుస్తకాల్ని ఈ టీమ్ పరిశీలించింది. భూమి సమాచారాన్ని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా తెలుసుకోవడంతోపాటుగా పొలం వద్దకు సులభంగా చేరుకునే విధానం బావుందన్నారు. అస్సాం నుంచి వచ్చిన టీమ్ సర్వే , భూరికార్డుల కంప్యూటరీకరణ, గ్రామాల్లో రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు, వెబ్‌లాండ్‌-2 తదితర అంశాల్ని పరిశీలించింది. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సీసీఎల్‌ఏ జయలక్ష్మి, సర్వేశాఖ డైరెక్టర్‌ కూర్మనాథ్‌, ఇతర అధికారులతో సమావేశమై అక్కడ అన్ని వివరాలు తెలుసుకున్నారు.