బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకి తరలింపు

Wait 5 sec.

మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణలతో తీవ్రమైన పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను అనంతరం మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించడంతో రాత్రి 12 గంటల సమయంలో అతనిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నెల 8వ తేదీన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్‌ పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిలు, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అతను హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో శనివారం ఉదయం నుంచే ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.భగీరథ్‌ విదేశాలకు పారిపోయే అవకాశముందనే బలమైన అనుమానంతో శనివారం ఉదయమే సైబరాబాద్ పోలీసులు అతనిపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి సైబరాబాద్‌ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హైదరాబాద్, కరీంనగర్‌లలోని వివిధ ప్రాంతాల్లో ఈ బృందాలు ముమ్మరంగా గాలించాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ నివాసానికి సైతం పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. నిందితుడి ఫోన్‌ స్విఛాఫ్‌ కావడంతో కాల్‌డేటా రికార్డులను విశ్లేషించిన పోలీసులు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడల్లోని అతని స్నేహితుల ఇళ్లలో వెతికారు. కరీంనగర్‌లోని భగీరథ్‌ నివాసంతో పాటు అతని మేనమామ వంశీకృష్ణ ఇల్లు, బీజేపీ శ్రేణుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.సాయంత్రం వేళ సైబరాబాద్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడంతో నిందితుడు ఎక్కడైనా లొంగిపోవచ్చుననే ప్రచారం జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పోలీస్‌ అకాడమీ సమీపంలో భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. రెండు వర్గాల ప్రకటనల అనంతరం.. రాత్రి 9 గంటల సమయంలో భగీరథ్‌ ఇద్దరు న్యాయవాదులతో కలిసి నాలుగు కార్ల కాన్వాయ్‌తో నేరుగా పేట్‌బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా స్టేషన్ ముందు పోలీసులు బారికేడ్లు వేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.భగీరథ్‌ స్టేషన్‌కు రాగానే కేసు పర్యవేక్షణాధికారిణి, డీసీపీ రితిరాజ్‌ అక్కడకు చేరుకుని విచారణను పర్యవేక్షించారు. మేడ్చల్‌ ఏసీపీ శంకర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌వర్ధన్‌ తదితరులు పంచనామా కోసం ఎమ్మార్వవో కార్యాలయ రికార్డు అసిస్టెంట్‌ బాలప్రసాద్‌ను పిలిపించి చట్టపరమైన పత్రాలు రెడీ చేశారు. అనంతరం నిందితుడికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేడ్చల్‌లోని మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకుముందు శనివారం ఉదయం BNS సెక్షన్ 183 ప్రకారం జడ్జి సమక్షంలో బాధితురాలైన మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి స్టేట్‌మెంట్ రికార్డు చేయించారు. ఈ వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్‌ చేసి భద్రపరిచారు. పోక్సో కేసులలో మేజిస్ట్రేట్ ముందు ఇచ్చే ఈ వాంగ్మూలమే తదుపరి కోర్టు విచారణకు, నిందితుడికి శిక్ష పడటానికి ప్రధాన ఆధారంగా నిలువనుంది.