పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సెక్రటేరియట్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలు నివాసం ఉండే ప్రాంతాలకు, వారి జీవనోపాధి కేంద్రాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఖరారు చేసిన 38 వేల ఇళ్లపై నిర్వహించిన శాస్త్రీయ సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పేదలకు 25 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు ఇవ్వడం వల్ల దాదాపు 16 వేల మంది ఆ ఇళ్లలో చేరలేదని కొందరు కిరాయికి ఇచ్చుకున్నారని సర్వేలో తేలింది. అందుకే నివాసం ఉండని వారి ఇళ్లను రద్దు చేసి వారు కోరుకున్న అనుకూల ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే శిథిలావస్థకు చేరిన వాంబే, ఎన్‌ఆర్‌జేఏఎంఎస్‌ కాలనీల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 1.32 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని జూన్ 2వ తేదీ నుంచి రెండో విడతను ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఉమ్మడి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, తక్కువ స్థలం ఉన్నవారు ఇప్పటికే ఉన్న ఇంటిపై పై అంతస్తుగా ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునే వెసులుబాటును పరిశీలిస్తున్నామన్నారు. లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూర్చేలా.. బేస్‌మెంట్, గోడలు లేదా స్లాబ్ దశలో ఆగిపోయిన పాత ఇళ్లను పూర్తి చేసుకునేందుకు కూడా ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అందుకే వాటిని నేరుగా అర్హులకు కేటాయించి మిగిలిన పనుల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిధులు ఇస్తామని తెలిపారు. బహుళ అంతస్తుల సముదాయాల్లోని వాణిజ్య దుకాణాలను విక్రయించి, ఆ సొమ్మును భవన నివాసితుల సంఘాల పేరిట డిపాజిట్ చేస్తామన్నారు. ఒక్కో ఇంటికి కేంద్రం ఇవ్వాల్సిన రూ. 1.13 లక్షల వాటాను విడుదల చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు.ఇళ్ల పథకంతో పాటు రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల ప్రభుత్వ విలువలకు బహిరంగ మార్కెట్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని పేర్కొన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలను శాస్త్రీయంగా సవరించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌ బాహ్యవలయ రహదారి పరిధి లోపల ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఓఆర్‌ఆర్‌ లోపల ఎకరా ప్రభుత్వ కనిష్ఠ విలువను రూ. 15 లక్షలుగా నిర్ధారించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.