ఐపీఎల్ 2026లో ఒక్క విజయం.. ఒక్కటంటే ఒక్క విజయం కోసం ఎంతగానో ఎదురుచూసింది. మొదటి ఆరు మ్యాచ్‌లలో కనీసం ఒక్కటి కూడా గెలవలేదు. ఈ ఏడాది చాలా స్ట్రాంగ్‌గా కనిపించిన కేకేఆర్.. గ్రౌండ్‌లో మాత్రం తేలిపోయింది. సీజన్ ముగిసేలోపు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తారా? అంటూ నెట్టింట ట్రోలింగ్ కూడా చేశారు. కానీ.. కేకేఆర్ కమ్ బ్యాక్‌కి ప్లే ఆఫ్స్ వెళ్లాల్సిన టీమ్స్ గిలగిలలాడిపోయాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మీద ఓడిపోగా.. పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది. అంటే తొలి ఆరు మ్యాచ్‌లలో ఐదు ఓడిపోయింది, ఇంకో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. పాయింట్ల పట్టికలో పదో స్థానానికి పడిపోయి, ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న కేకేఆర్, ఆ రోజు నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. రాజస్థాన్‌పై గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ మొత్తం ఏడ్చేసింది. 2024 ఐపీఎల్ టైటిల్ అందుకున్న తర్వాత కూడా అంత ఎమోషనల్ కాలేదని వరుణ్ చక్రవర్తి చెప్పాడు. ఇక అప్పటి నుంచి మొదలు వరుసగా విజయాలు సాధిస్తూనే ఉంది. లక్నోసూపర్ జెయింట్స్‌పై సూపర్ ఓవర్‌లో గెలిచిన కేకేఆర్, సన్‌రైజర్స్‌ని ఉప్పల్ స్టేడియంలో చిత్తు చేసింది. ఢిల్లీని ఓడించి ప్లే ఆఫ్స్ రేసు నుంచే బయటకు పంపించేసింది. అయితే, కేకేఆర్ వరుస విజయాలకు ఆర్సీబీ బ్రేకులు వేసింది. రాయ్‌పూర్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడంతో కేకేఆర్ విజయాలకు బ్రేక్ పడింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌‌ను ఓడించి ప్లే ఆఫ్స్ బెర్త్‌ కన్ఫార్మ్ చేసుకోవాలని చూసిన గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ షాక్ ఇచ్చింది. హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసి గుజరాత్‌ను ఓడించింది. దాంతో గుజరాత్ తన చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితికి వచ్చింది. కేకేఆర్ తన చివరి రెండు మ్యాచ్‌లలో ముంబై, ఢిల్లీతో తలపడనుంది.