IPL 2026కి ఒక్క టీమ్ కూడా క్వాలిఫై కాలేదు.. ఇక మిగిలింది ఒక్క వారమే, 60 మ్యాచ్‌లు పూర్తయినా ఏంటిదీ..!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఒక్కో టీమ్ 12 మ్యాచ్‌లు ఆడేసింది.. అంటే ఆల్‌మోస్ట్ లీగ్ స్టేజ్ పూర్తయింది. ఇంకో వారం రోజులు మాత్రమే ఉన్నాయి.. కానీ, ఇప్పటి వరకు ఏ ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కి కావాల్సిన పాయింట్లు సాధించినా, అధికారికంగా అర్హత సాధించలేదు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ - గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ సినారియో ఇంకాస్త క్లిష్టంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ జట్టు ఇంటికి వెళ్తుందో, ఏ జట్టు ప్లే ఆఫ్స్‌కి వెళ్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో కేకేఆర్‌పై ఆడి ఓటమిపాలయింది. దాంతో సీఎస్కేతో జరిగే ఆఖరి మ్యాచ్ గిల్ సేన‌కు చావో రేవో అన్నట్టు తయారయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ జట్టయితే మొదట 18 పాయింట్లు సాధిస్తుందో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంతో పాటు, టాప్ 2 పొజిషన్స్‌లో కచ్చితంగా నిలుస్తుంది. గుజరాత్ టైటాన్స్‌కు కేవలం ఒక్క మ్యాచే మిగిలుండగా.. ప్రస్తుతం టాప్ 4లో ఉన్న జట్లకు ఇంకో రెండు మ్యాచ్‌ల అవకాశం ఉంది.పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌లలో 8 గెలిచి 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిస్తే ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించడంతో పాటు టాప్ 2లో కచ్చితంగా నిలుస్తుంది. గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌లలో 16 పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్స్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలంటే సీఎస్కేతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో ఉంది. ఆఖరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే టాప్ 2లో, ఒక మ్యాచ్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో ఉండనుంది. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌లో అర్హత సాధించాలంటే కచ్చితంగా ఆఖరి రెండు మ్యాచ్‌లనూ గెలవాల్సిన పరిస్థితి. అప్పుడే 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ 17 పాయింట్లకు రాగలదు. రాజస్థాన్ రాయల్స్‌కు అందరికంటే ఎక్కువ అవకాశాలున్నాయి. 11 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లు సాధించడంతో మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు కచ్చితంగా గెలవాలి. మూడూ గెలిస్తే టాప్ 2 గ్యారెంటీ. సీఎస్కే ఆఖరి రెండు మ్యాచ్‌లు కూడా చావోరేవో పరిస్థితి. గుజరాత్‌ను ఓడించిన కేకేఆర్‌కు కూడా ఛాన్స్ ఉంది. ఆఖరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే 15 పాయింట్లు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి కేకేఆర్‌కూ ఛాన్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి రెండు మ్యాచ్‌లలో గెలిచినా 14 పాయింట్లు మాత్రమే సాధించగలదు. ప్లే ఆఫ్స్‌కు వెళ్లలేకపోయినా రాజస్థాన్, కేకేఆర్ ఆశలకు గండికొట్టే అవకాశం ఉంది. ముంబై, లక్నో ఎలిమినేట్ అయినప్పటికీ.. తమ తమ చివరి రెండు మ్యాచ్‌లలో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే జట్లకు ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ముంబై చివరి రెండు మ్యాచ్‌లు కేకేఆర్, రాజస్థాన్‌తో ఆడనుండగా.. లక్నో జట్టు రాజస్థాన్, పంజాబ్‌తో తలపడనుంది.