దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు మంత్రం గట్టిగానే వినిపిస్తోంది. ప్రధాని మోదీ పిలుపుతో ప్రజా ప్రతినిధులు, అధికారులు కాన్వాయ్‌లో వాహనాలు తగ్గించుకుంటున్నారు. కొంతమంది ప్రజా రవాణాను ఉపయోగిస్తుంటే.. మరికొందరు బైక్‌లు, సైకిళ్లపై విధులకు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ పిలుపుతో ఆంధ్రప్రదేశ్‌లోనూ , మంత్రులు, ప్రజా ప్రతినిధులు కాన్వాయ్‌లోని వాహనాలను కుదించుకున్నారు. ఏపీ కేబినెట్‌లో ప్రభుత్వ పరంగా పొదుపు ఎలా చేయాలో చర్చించారు.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీ పిలుపుతో బీజేపీ ఎమ్మెల్సీ ఒకరు ఇంధనం ఆదా చేసేందుకు ఏకంగా కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఆయనే స్వయంగా వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొత్తగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా దేశ ప్రజలను ప్రేరేపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును ఆదర్శంగా తీసుకుని.. తాను కూడా పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తూ సాధ్యమైనంత మేరకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే ప్రధానమంత్రి మోదీ స్ఫూర్తితో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు వీడియోను విడుదల చేశారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. నేతలు, ప్రజా ప్రతినిధులు కాన్వాయ్‌లో వాహనాలు తగ్గించుకోవడం, బైక్‌లను ఉపయోగిస్తుంటే సోము వీర్రాజు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశారు.ఇదిలా ఉంటే.. ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇంధన పొదుపుబాటపట్టారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు కాన్వాయ్‌ను పూర్తిగా పక్కనపెట్టి బైక్‌లపై వెళుతున్నారు. గురువారం అమరావతిలో కేబినెట్ సమావేశం నిర్వహించగా చాలామంది మంత్రులు ఒక్కకారుతో వచ్చారు. ప్రధాని మోదీ పిలుపుతో చాలామంది విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.. కొద్దిరోజులుగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిందని చెబతున్నారు. మొత్తం మీద ప్రధాని మోదీ పొదుపు మంత్రం బాగానే పనిచేస్తుందని చెప్పాలి.