తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి లాయర్‌గా మారారు. ఎన్నికల అనంతరం బెంగాల్‌లో చెలరేగిన హింసపై దాఖలైన పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు దీదీ కలకత్తా హైకోర్టుకు వచ్చారు. తన ట్రేడ్ మార్క్ తెలుపు రంగు కాటన్ చీరపై నల్లకోటు వేసుకుని కోర్టుకు వచ్చి, ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధ్విసభ్య ధర్మాసనం ముందు ఆమె వాదనలు వినిపించారు. ప్రభుత్వం మారిన తర్వాత వారం రోజుల్లోనే మహిళలు, మైనారిటీలపై దాడులు ఆందోళనకర స్థాయికి చేరాయని మాజీ సీఎం ఆరోపించారు. తాను 1995లోనే బార్ కౌన్సిల్‌లో లాయర్‌గా పేరు నమోదు చేసుకున్నానని, సభ్యత్వాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నట్టు ధర్మాసనానికి దీదీ వివరించారు. దీంతో మమతా బెనర్జీ లాయర్ హోదాపై ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆరా తీసింది. ఆమె లాయర్ వృత్తికి సంబంధించిన పూర్తి వివరాలను తమకు రెండు రోజుల్లోగా అందజేయాలని బెంగాల్ బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. ఆమె ఎన్‌రోల్‌మెంట్ నంబర్, నమోదైన తేదీ, 2011 నుంచి 2026 వరకు సీఎంగా ఉన్నప్పుడు ప్రాక్టీస్‌ నిలిపివేశారా? తిరిగి ఎప్పుడు పునరుద్ధరించుకున్నారు? వంటి వివరాలను బార్ కౌన్సిల్ కోరింది. ఆమె రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగినందున, న్యాయవాద వృత్తి హోదాపై వాస్తవాలను నిర్దారించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అన్ని ఒరిజినల్ రికార్డులను భద్రపరచాలని, ఎటువంటి మార్పులు చేయరాదని కూడా ఆదేశించింది.కాగా, ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో ప్రాణాలు కోల్పోయినవారి ఫోటోలు, జాబితాను ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, జస్టిస్ పార్థ సారథి సేన్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌కు మమతా బెనర్జీ సమర్పించినట్లు సమాచారం. ఈ సందర్భంగా బెంగాల్ ప్రజలను రక్షించాలని ఆమె కోర్టును కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు, దోపిడీలు, బెదిరింపులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి అనంతరం పెరిగిన రాజకీయ ఉద్రిక్తతల నడుమ దీదీ హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో ఆమెకు వ్యతిరేకంగా ‘చోర్..చోర్’ అంటూ నినాదాలు చేశారు. సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ కుమారుడు, లాయర్ శిర్సన్య బెనర్జీ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు.