రాష్ట్రంలో మరింత పెరగనున్న ఎండలు.. 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Wait 5 sec.

రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సాయంత్రం 5 గంటల వరకు భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. తాజాగా వాతావరణ శాఖ అధికారులు కీలక విషయాలు చెప్పారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఏకంగా రెడ్ అలర్ట్ జారీ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రానున్న 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో సూర్యుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తీవ్ర హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి మధ్యాహ్నం పూట బయటికి రావద్దని హెచ్చరికలు చేశారు. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక రోగులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. మరీ ముఖ్యంగా ఈనెల 16, 17, 18వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి ఎండ తీవ్రత పెరగడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.5 డిగ్రీల వరకు నమోదు కాగా.. మెదక్‌లో 42 డిగ్రీలు.. హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.