సనాతన ధర్మంపై ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలకు అధికార టీవీకే స్పందించింది. తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. ‘‘టీవీకే కుల వ్యవస్థకు, అసమానతలకు వ్యతిరేకం, మూఢనమ్మకాలకు వ్యతిరేకం.. కానీ మేము ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తాం.. మేము హిందువులకు వ్యతిరేకం కాదు.. కానీ, హిందుత్వకు వ్యతిరేకం’’ అని అన్నారు. అంతేకాదు, వ్యక్తిగతంగా నాకు దేవుడిపై నమ్మకం లేనప్పటికీ, ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా తాను అన్ని మతాలను, కులాలను గౌరవిస్తానని ఆయన తెలిపారు.‘‘మేము హిందువులు, క్రైస్తవులు, ముస్లింలను ఎల్లప్పుడూ సమానంగా చూస్తాం... మేము అన్ని విశ్వాసాలను గౌరవిస్తాం.. నాకు వ్యక్తిగతంగా దేవుడిపై నమ్మకం లేకపోయినా మంత్రిగా, ఎమ్మెల్యేగా అన్ని మతాలను నేను గౌరవించాలి, మా నాయకుడు (ముఖ్యమంత్రి విజయ్) కూడా గౌరవించాలి. అదే భారత రాజ్యాంగం. మేము ఎలాంటి ఆధిపత్యాన్ని నమ్మం.. మేము హిందువులకు వ్యతిరేకం కాదు; మేము హిందుత్వకు వ్యతిరేకం. హిందుత్వ అంటే ఒకరి మతాన్ని బలవంతంగా రుద్దడం.. 'సనాతన' అనే పదాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు’’ ఆయన అన్నారు.‘‘ఉత్తరాదిన సనాతన అంటే 'హిందూ', కానీ తమిళనాడులో '' అంటే అసమానత. దీనిపైనే ఎప్పుడూ వివాదం జరుగుతుంది.. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ ఉద్దేశం కూడా అదే కావచ్చు’’ అని అన్నారు. అందుకు తన ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రి అదవ అర్జున కోరారు. ‘‘మేము అసమానతకు వ్యతిరేకం, కానీ ఏ మతానికి వ్యతిరేకం కాదు’’ అని ఆయన పునరుద్ఘాటించారు.