'బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఓ జోకర్.. పరువునష్టం కేసు వేస్తా'.. మంత్రి టీజీ భరత్ వార్నింగ్

Wait 5 sec.

వైసీపీ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒక జోకర్ అంటూ ఎద్దేవా చేశారు. మాటలు చెప్పడానికి మాత్రమే పనికి వస్తాడని.. ఎన్నికల్లో పోటీ చేయడానికి పనికి రాడని విమర్శించారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎక్కడా టికెట్ తెచ్చుకోలేదని పేర్కొన్నారు. దమ్ముంటే.. 2029 ఎన్నికల్లో అయినా ఎక్కడి నుంచైనా వైసీపీ నుంచి టికెట్ దక్కించుకోవాలని ఛాలెంజ్ విసిరారు. కర్నూలులో అయినా టికెట్ తెచ్చుకోవాలని హితవు పలికారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక జోకర్ కాబట్టే.. వైసీపీ అతనికి టికెట్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తమ కుటుంబం 1999 నుంచి రాజకీయాల్లో ఉందని.. కానీ ఎన్నడూ తమపై అవినీతి ఆరోపణలు గానీ, నిందలు గానీ రాలేదని మంత్రి టీజీ భరత్ గుర్తు చేశారు. తాను, తన తండ్రి, తమ కుటుంబంపై ప్రతిపక్షాలు కూడా అవినీతి ఆరోపణలు చేయలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విషయాలపై మాట్లాడతారనే.. వైసీపీ పార్టీ అతడ్ని ఒక జోకర్‌ లాగా వాడుకుంటోందని పేర్కొన్నారు. కానీ కర్నూల్‌లో తనపైనే నిందలు వేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. తమపై అవినీతి ఆరోపణలు చేయడం అంటే అది ఒక జోక్ అని మంత్రి భరత్ అభివర్ణించారు. తనపై వేసిన నిందల పట్ల ఊరుకునేది లేదని.. తాను క్రిమినల్ పరువు నష్టం కేసు వేస్తానని మంత్రి టీజీ భరత్ తేల్చి చెప్పారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చాలా చిన్న వయసులోనే జైలుకు వెళ్లి వచ్చాడని, హత్య కేసులో ఉన్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా అనవసరంగా సమస్యలు సృష్టించారని ఆరోపించారు. ఇన్నాళ్లు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదని.. కానీ తాను మాత్రం ఈసారి వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. తాము పనిపై దృష్టి పెట్టామని.. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నంలో ఉన్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. కర్నూలుకు, మరీ ముఖ్యంగా ఓర్వకల్లుకు కంపెనీలను తీసుకువచ్చేందుకు తాము ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. రిలయన్స్ సంస్థను తీసుకువచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. రూ.3600 కోట్ల పెట్టుబడులను ఓర్వకల్లుకు తీసుకువచ్చినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇక ఇటీవల కర్నూలులో నిర్వహించిన ధర్మాలో మాట్లాడిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. మంత్రి టీజీ భ‌రత్‌‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కనుసన్నల్లోనే కర్నూలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ కళ్లుగప్పి.. మంత్రి టీజీ భరత్ రూ.వందల కోట్లను దోచుకుంటున్నారని ఆరోపించారు.