కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉన్నారని, అలాంటప్పుడు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్‌లో ఎందుకు లేరని, ఇందులో ప్రజాస్వామ్యం సంగతేంటి? అని గురువారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పై విధంగా స్పందించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. ‘‘సీబీఐ డైరెక్టర్ ఎంపికలో చీఫ్ జస్టిస్ ఉంటారు. శాంతిభద్రతల నిర్వహణ లేదా చట్టబద్ధమైన పాలన కోసం ఆయన కమిటీలో ఉన్నారని మనం అనుకుందాం... మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడానికి ఆయన అవసరం లేదా?’ అని ప్రశ్నించారు.‘‘కచ్చితంగా సీజేఐ ఉండాలని మేము అనడం లేదు. కానీ ఎంపిక కమిటీలో ఒక స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదు? అందులో మంత్రి ఎందుకు ఉండాలి? ప్రస్తుత విధానం ప్రకారం ప్రధాన మంత్రి ఒకరిని, ప్రతిపక్ష నేత మరొకరిని సూచిస్తారని అనుకుందాం. వారిద్దరి మధ్య భేదాభిప్రాయం వస్తే, మూడో సభ్యుడు (మంత్రి) ప్రతిపక్ష నాయకుడి వైపు నిలుస్తారా?’’ అని న్యాయమూర్తి నిలదీశారు. దీనికి అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సమాధానమిస్తూ.. తాను ఊహించదలచుకోలేదని అన్నారు.‘‘ఆచరణలో అలా ఉండకపోవచ్చు.. దాని గురించి నేను మళ్లీ ఊహించదలచుకోలేదు’’ అని అటార్నీ జనరల్ అన్నారు. జస్టిస్ దత్తా జోక్యం చేసుకుంటూ..‘అలాగైతే, అన్నింటినీ నియంత్రించేది కార్యనిర్వాహక వర్గమే కదా’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి నియామకాలపై నిర్ణయం వాస్తవానికి 2:1 మెజారిటీతో తీసుకోబడుతుందని, క్యాబినెట్ మంత్రి ప్రధాని వైఖరితో విభేదించే అవకాశం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.‘‘ప్రాథమికంగా మమ్మల్ని ఆందోళనకు గురిచే విషయం ఏమిటంటే, కార్యనిర్వాహక విభాగానికి వీటో ఎందుకు ఉంది? గత తీర్పులు ఉన్నప్పటికీ, పార్లమెంటుకు ఈ కేసుల గురించి తెలియదా? చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ సుప్రీంకోర్టు అంతిమ నిర్ణేత. మీకు నచ్చినా నచ్చకపోయినా చట్టాలను వ్యాఖ్యానించే అధికారం దానికి ఉంటుంది’’ అని జస్టిస్ దత్తా అన్నారు.