అమెరికా అధ్యక్షుడు మూడో రోజుల పర్యటన నిమిత్తం చైనాలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, దాని పర్యావసనాల ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్న సమయంలో.. జరుగుతోన్న ఈ పర్యటన అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ బృందం చైనాలో ల్యాండ్ అయ్యింది మొదలు.. అంతర్జాతీయ మీడియా మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్, షేక్ హ్యాండ్, వారి బాడీ లాంగ్వేజ్‌ను కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ నాయకులను కలిసినప్పుడు హ్యాండ్ షేక్‌ను కేవలం పలకరింపుగా మాత్రమే కాకుండా.. దాన్ని ఒక ఆయుధంలా, తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వాడటాన్ని చాలా మంది బాడీ లాంగ్వేజ్ నిపుణులు గమనించారు. బీజింగ్‌లోనూ షి జిన్‌పింగ్ విషయంలోనూ ట్రంప్ ఇదే వ్యూహాన్ని అమలు చేయబోయారు. కానీ చైనా అధ్యక్షుడి ముందు ఆయన పాచికలు పారలేదు.సాధారణంగా ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకొని, తన వైపు లాగడం చేస్తారు లేదంటే మరో చేతితో వారి అరచేతిని తడుముతూ ఇక్కడ నేనే బాస్ అనే సంకేతాలు ఇస్తారు. నిపుణులు దీన్ని పవర్ ప్లే అని అభివర్ణిస్తారు. ఇరు దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశానికి ముందు.. ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’ వెలుపల ట్రంప్, జిన్‌పింగ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ సమయంలో ట్రంప్ తనదైన శైలిలో జిన్‌పింగ్‌ను తనవైపు లాగడానికి ప్రయత్నించారు. కానీ జిన్‌పింగ్ స్థిరంగా నిలబడి, ట్రంప్‌నే తన వైపు లాగారు. తద్వారా ఆధిపత్యం కనబర్చాలనే ట్రంప్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.వ్యాపారవేత్తలు, అధికారులతో కలిసి వచ్చిన ట్రంప్.. హ్యాండ్ షేక్ కోసం జిన్‌పింగ్‌ను సమీపించారు. బాడీ లాంగ్వేజ్ నిపుణురాలైన జూడీ జేమ్స్ ఇది ఆసక్తికరమైన విషయం అని తెలిపారు. ‘ట్రంప్ కొన్ని అడుగుల దూరం నుంచి షేక్ హ్యాండ్ ముందుగా ఆఫర్ చేశారు. సాధారణంగా హ్యాండ్ షేక్‌ను ప్రారంభించే వారు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని భావిస్తారు. సాధారణంగా ఆతిథ్యం ఇచ్చేవారు ఈ పని చేస్తుంటారు’ అని ఆమె తెలిపారు. అంటే జిన్‌పింగ్ చేయి ముందుకు చాపితే కరచాలనం చేయాల్సిన ట్రంప్.. తనే చొరవ తీసుకున్నారు.తర్వాత మరోసారి జిన్‌పింగ్‌తో కరాచలనం చేసేటప్పుడు ట్రంప్ కొద్దిగా ఆయన వైపు ఒరిగారు. ‘ఇది జిన్‌పింగ్ పట్ల ఆయనకు ఉన్న సాన్నిహిత్యాన్ని, ఆత్మీయతను సూచిస్తుంది.. ట్రంప్ పర్యటనల్లో ఇది చాలా కీలకమైందని.. దీన్ని ఆయన ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు’ అని కమ్యూనికేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ అయిన డాక్టర్ లిలియన్ గ్లాస్ అభిప్రాయపడ్డారు.ఈ పర్యటన సందర్భంగా అమెరికా అధినేత.. షి జిన్‌పింగ్ పైనా, చైనాపైనా పొగడ్తలు గుప్పించారు. ఎదుటి వారిని పొగిడి తన పనులు చక్కబెట్టుకోవాలనేది వ్యాపారవేత్త అయిన ట్రంప్‌‌కు మొదటి నుంచి అలవాటు.అనంతరం గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో ఇరు దేశాల అగ్రనేతల మధ్య రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. జిన్‌పింగ్‌ను కలవడం తనకు దక్కిన గౌరవమన్నారు. ‘‘మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం వాటిని పరిష్కరించుకున్నాం. నేను మీకు ఫోన్ చేసేవాణ్ని, మీరు కూడా నాకు ఫోన్ చేసేవారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మాకు (ట్రంప్, జిన్‌పింగ్)కు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మేం దాన్ని చాలా త్వరగా పరిష్కరించుకునేవాళ్లం’’ అని ట్రంప్ తెలిపారు. మీరు ఒక గొప్ప నేత అని అందరికీ చెబుతానని జిన్‌పింగ్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.చర్చల అనంతరం ఇద్దరు నేతలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన టెంపుల్ ఆఫ్ హెవెన్‌ను సందర్శించారు. ఇక్కడ కూడా చైనాపై ఆయన ప్రశంసలు గుప్పించారు.సాధారణంగా ఆతిథ్యం ఇచ్చిన దేశాధినేత అతిథికి దిశానిర్దేశం చేస్తుంటారు. కానీ రివర్స్‌లో చైనా అధ్యక్షుడికి ట్రంప్ సైగల ద్వారా దిశానిర్దేశం చేయడాన్ని చాలా మంది గమనించారు.అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చాలా ప్రశాంతంగా ఉంటూ.. ట్రంప్‌తో ఉన్నప్పుడు గంభీరాన్ని ప్రదర్శించారని బాడీ లాంగ్వేజ్ నిపుణులు చెబుతున్నారు. జిన్‌పింగ్ ట్రంప్‌తో స్నేహపూర్వకంగా మెలిగినప్పటికీ.. గత ఏడాది ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చైనా వచ్చినప్పుడు చూపించినంత సాన్నిహిత్యాన్ని గానీ.. రష్యా అధ్యక్షుడు బీజింగ్ వచ్చినప్పుడు కనబర్చిన ఆత్మీయతను కానీ ఆయన ట్రంప్ దగ్గర ప్రదర్శించలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.చాలా సందర్భాల్లో ట్రంప్.. జిన్‌పింగ్ చేతిపైనా లేదా వీపుపై తట్టారు. ఇది స్నేహపూర్వక సంకేతం మాత్రమే కాకుండా అధికారాన్ని ప్రదర్శించే చర్య కూడా అని బాడీ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ చర్యకు ప్రతిగా అన్నట్టుగా.. జిన్‌పింగ్ సైతం అమెరికా అధ్యక్షుడి వీపు మీద తట్టడం ద్వారా కొంత ఆత్మీయతను కనబర్చారు. ఇవన్నీ గమనించిన నెటిజన్లు.. బాడీ లాంగ్వేజ్ వార్‌లో జిన్‌పింగ్ పై చేయి సాధించారని అభిప్రాయపడుతున్నారు.