ఢిల్లీ సర్కారు పొదుపు చర్యలు..ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్

Wait 5 sec.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పలు రాష్ట్రాలు ఇంధన పొదుపు చర్యలకు ఉపక్రమించాయి. తాజాగా, కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజుల పాటు ఇంటి నుంచి పని చేయాలని, వాహనాల వినియోగాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఈ నిర్ణయాలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. ముఖ్యమంత్రి తన అధికారిక కాన్వాయ్‌ను కూడా దాదాపు 60 శాతం తగ్గించి, కేవలం నాలుగు వాహనాలకు పరిమితం చేశారు. ఈ కాన్వాయ్‌లో ఇప్పుడు కేవలం నాలుగు వాహనాలు మాత్రమే ఉండగా... వాటిలో రెండు ఎలక్ట్రిక్ వాహనాలు. ఇంధన పొదుపు, సమర్థవంతమైన పాలనను ప్రోత్సహించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ‘‘మేరా భారత్ మేరా యోగ్దాన్’’ (నా దేశం, నా సహకారం) అనే నినాదాన్ని ఎత్తుకుంది. ప్రతి సోమవారం మెట్రోడేగా పరిగణిస్తామని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ మెట్రోలో ప్రయాణిస్తారని ప్రభుత్వం తెలిపింది. వారంలో ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాబోయే ఆరు నెలల పాటు పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల కొత్త కొనుగోళ్లు ఉండవని పేర్కొంది. ఉద్యోగుల రవాణా భత్యాన్ని 10 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.విదేశీ ప్రయాణాలపై కూడా నిషేధం విధించింది. రాబోయే ఏడాది పాటు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏ మంత్రి గానీ, అధికారి గానీ అధికారిక విదేశీ పర్యటన చేపట్టరని ప్రభుత్వం తెలిపింది. మూడు నెలల పాటు భారీ కార్యక్రమాలను రద్దుచేసినట్టు పేర్కొంది. దీంతో పాటు పొదుపు చర్యలపై అవగాహన కల్పించేందుకు 90 రోజుల ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. పొదుపును ప్రోత్సహించి, దేశ నిర్మాణానికి తోడ్పడతామని పౌరులతో ప్రతిజ్ఞ చేయిస్తామని ప్రభుత్వం తెలిపింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉపయోగించాలని నిర్ణయించారు. అనవసరమైన విద్యుత్ వృధాను నివారించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్టర్ స్విచ్‌లను ఏర్పాటు చేయనున్నారు.