తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు తీసుకువస్తూ.. నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు కలిసి ఈ మార్పులకు శ్రీకారం చుట్టాయి. 2026-2027 అకడమిక్ ఇయర్ నుంచే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో ఈ సరికొత్త మార్పులు అమల్లోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త ఇంటర్ విద్యా విధానంలో భాగంగా.. మ్యాథమేటిక్స్ సబ్జెక్టుతోపాటు.. ప్రాక్టికల్స్ పరీక్షల మార్కుల్లో మార్పులు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో భయం లేకుండా.. వాటిపై మరింత ఆసక్తి పెంచేందుకే ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.ఇక ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌లో కేవలం సెకండ్ ఇయర్‌లో మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండేవి. కానీ తాజాగా తీసుకువచ్చిన మార్పుల ప్రకారం.. ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో 30 మార్కుల చొప్పున సెకండియర్‌లో ప్రాక్టికల్స్ ఉండేవి. అయితే వీటిని ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌కు విడగొట్టారు. ఈ నిర్ణయం వల్ల ఫస్టియర్ నుంచే విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై పట్టు ఉంటుందని పేర్కొంటున్నారు. అదే సమయంలో ఇంటర్మీడియట్‌లో కీలక సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్‌లో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం మ్యాథ్స్ సబ్జెక్టులో 15 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా వేయనున్నారు. ఇక ఫైనల్ పరీక్షల్లో మ్యాథ్స్ సబ్జెక్టుకు ఇప్పటివరకు 75 మార్కులు ఉండగా.. 15 మార్కులను తీసేసి.. ఇక నుంచి 60 మార్కులకు మాత్రమే పరీక్షను నిర్వహించేలా ఇంటర్ బోర్డు తాజాగా కీలక మార్పులు చేసింది. మరోవైపు.. లాంగ్వేజీ పరీక్షల్లో కూడా కీలక మార్పులను ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్‌, తెలుగు లేదా సంస్కృతం సబ్జెక్టులకు కూడా 100 మార్కులకు బదులుగా 80 మార్కులకే పరిమితం చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా విద్యార్థులకు వేయనున్నారు. ఇంటర్‌లో విద్యార్థులు బట్టీపట్టే విధానాన్ని తగ్గించి.. వారికి జ్ఞాపకశక్తిని పెంపొందించేలా.. ప్రాక్టికల్స్ స్కిల్స్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చినట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.