అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కారిడార్‌ ప్రాజెక్టుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. రెండు ఐటీ మహానగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ఎలైన్‌మెంట్ సర్వే ప్రక్రియ దాదాపు కొలిక్కి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు ప్రతిష్ఠాత్మక బుల్లెట్ రైలు కారిడార్లలో ఒకటైన ఈ మార్గం.. ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాల గుండా సాగేలా సరికొత్త రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. తెలంగాణలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతూ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ హైస్పీడ్ కారిడార్ ముగుస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే సుమారు 205 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గం నిర్మించనున్నారు.అయితే, ఈ కారిడార్ తుది రూపురేఖల విషయంలో తొలుత శంషాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, కర్నూలు మీదుగా ట్రాక్ నిర్మించాలని భావించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మహబూబ్‌నగర్ వైపు ఇప్పటికే రైల్వే నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నందున.. ట్రైన్ సదుపాయం లేని ప్రాంతాల మీదుగా బుల్లెట్ రైలు మార్గాన్ని తీసుకెళ్లాలని సూచించింది. ప్రభుత్వం సూచించిన శంషాబాద్, మన్ననూరు-శ్రీశైలం, సోమశిల రూట్ వైపే ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ మొగ్గు చూపింది. కొత్త అలైన్‌మెంట్ ప్రకారం.. కోకాపేటలో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్ రైలు, శంషాబాద్ మీదుగా నల్లమల అటవీ ప్రాంతాన్ని తాకుతూ.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్ననూరు, కృష్ణా నది తీరంలోని సోమశిల మీదుగా కర్నూలుకు కనెక్ట్ అవుతుంది.నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఉన్న మార్గం టైగర్ రిజర్వ్ జోన్ కావడమే కాకుండా ఘాట్ రోడ్డుతో కూడుకున్నది కావడంతో ఇక్కడ పర్యావరణ అనుమతులు, సాంకేతిక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం అత్యాధునిక ఎకో-ఫ్రెండ్లీ ఇంజినీరింగ్ డిజైన్లను పరిశీలిస్తున్నారు. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు ఉన్న మొదటి స్ట్రెచ్ కనెక్టివిటీ కోసం ప్రస్తుతం రెండు ఆప్షన్లపై సర్వే జరుగుతోంది. ఇందులో మొదటిది ఔటర్ రింగ్ రోడ్ వెంబడి నిర్మించడం కాగా, రెండోది ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల నుంచి ప్రతిపాదించడం. ప్రాథమిక సర్వే పూర్తయిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించనున్నారు. డీపీఆర్ దశలో పర్యావరణ, భౌగోళిక పరిస్థితులను బట్టి స్వల్ప మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఈ హైస్పీడ్ ట్రైన్ కారిడార్ ద్వారా తెలంగాణ పరిధిలో ఐదు అత్యాధునిక బుల్లెట్ రైల్వే స్టేషన్లను నిర్మించబోతున్నారు. మౌలిక వసతుల హబ్‌గా మారుతున్న శంషాబాద్, ప్రతిష్ఠాత్మక భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, ఆమన్‌గల్లు, పర్యాటక ప్రాంతాలైన మన్ననూరు, సోమశిలలను హైస్పీడ్ స్టేషన్లుగా గుర్తించారు. ఈ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ఆయా ప్రాంతాల ఆర్థిక స్వరూపం మారిపోవడంతో పాటు పర్యాటక రంగానికి భారీగా ఊతం లభించనుంది. గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం కేవలం రెండున్నర నుంచి మూడు గంటల్లోనే పూర్తవుతుంది. డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.