మాడు పగిలే తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ విభాగం (IMD) ఎట్టకేలకు చల్లని కబురు చెప్పింది. దేశ వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది షెడ్యూల్ కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు.. ఈసారి ఐదు రోజులు ముందుగానే అంటే మే 26 నాటికే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల ఆధారంగా మే 22 నుంచి మే 30 మధ్య కాలంలో ఎప్పుడైనా ఇవి కేరళ తీరాన్ని తాకవచ్చని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో ఉండబోతోంది. సాధారణంగా కేరళ తీరాన్ని తాకిన ఐదు రోజుల తర్వాత రుతుపవనాలు రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశిస్తాయి. గతేడాది వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే.. మే 24న కేరళను తాకిన రుతుపవనాలు మే 31 నాటికి తెలంగాణను పలకరించాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 1 లేదా రెండో తేదీ నాటికే తెలంగాణవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ముందస్తు రుతుపవనాల రాకతో తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు, సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది.అయితే, వర్షపాతం విషయంలో వాతావరణ శాఖ ఒక కీలక హెచ్చరికను కూడా జారీ చేసింది. ఈ ఏడాది రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే కొంచెం తక్కువగా వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ అభిప్రాయపడింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో పరిస్థితులే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఈ వర్షాకాలంలో సగటున 80 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉండగా.. 1971-2020 మధ్య కాలానికి సంబంధించిన దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లుగా ఉంది. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ.. ముందస్తు రుతుపవనాల రాక సాగు పనులకు సానుకూలంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. శుక్రవారం పగటిపూట అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలో 44.5 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.