రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు కోచ్‌లు దగ్ధం

Wait 5 sec.

మధ్యప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు కలకలంరేపాయి. త్రివేండ్రం నుంచి హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇవాళ తెల్లవారుజామున కోటా రైల్వే డివిజన్‌ పరిధిలోని రత్లాం స్టేషన్ నుంచి రైలు బయల్దేరగా.. ఆలోట్- విక్రమ్‌గఢ్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఏసీ కోచ్‌ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రైలు కోచ్‌లో నుంచి మంటలు రావడాన్ని గార్డ్ గమనించి వెంటనే లోకో పైలట్‌ను అలర్ట్ చేశారు. వెంటనే రైలును అక్కడే నిలిపివేయగా.. రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోగీల్లోని ప్రయాణికుల్ని అప్రమత్తం చేసి కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతకముందు బోగీల్లో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. రైల్వే అధికారులు వెంటనే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి మంటలు అంటుకున్న బోగీలను వేరు చేశారు. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని చెబుతున్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటన కారణంగా.. ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏసీ బోగీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.. రైల్వేశాఖ ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.. పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.రైలులో ఆన్‌బోర్డ్ గార్డు మంటలు చెలరేగుతున్న విషయాన్ని గమనించిన వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆయన కొద్దిసేపు కూడా ఆలస్యం చేయకుండా మంటలంటుకున్న విషయాన్ని లోకోపైలట్‌తో పాటుగా రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే గార్డు అత్యవసరంగా రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు ఆగిన వెంటనే రైల్వే సిబ్బంది వేగంగా స్పందించి, మంటలు చెలరేగిన కోచ్‌ను రలు నుంచి వేరు చేశారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని చెబుతున్నారు.