భక్తులకు తీపి కబురు.. యాదగిరిగుట్టకు MMTS ట్రైన్ పొడిగింపు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Wait 5 sec.

తెలంగాణలో రైల్వే రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్‌లోని ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న ప్రయాణికుల మౌలిక వసతుల కల్పన, ఆధునికీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్‌భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ను రూ. 26 కోట్ల భారీ బడ్జెట్‌తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పనులన్నింటినీ రాబోయే డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రజలకు, స్థానిక ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆయన మలక్‌పేట రైల్వేస్టేషన్‌ను కూడా సందర్శించి, అక్కడ జరుగుతున్న ప్రగతి పనుల వేగాన్ని సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి నగర ప్రయాణికులకు తీపి కబురు అందించారు. హైదరాబాద్ నగర శివార్లకు రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని ప్రధాన మార్గం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సర్వీసులను పొడిగించనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల నిత్యం వేలాది మంది భక్తులకు, ఉద్యోగులకు తక్కువ ఖర్చుతో కూడిన సురక్షిత ప్రయాణం లభిస్తుందన్నారు. గత పాలకుల హయాంతో పోలిస్తే.. గడిచిన 12 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 347 కిలోమీటర్ల మేర నూతన రైల్వేలైన్లను నిర్మించిందని చెప్పారు. అనేక మార్గాలను విద్యుద్దీకరణ, డబ్లింగ్ పూర్తి చేసిందని ఈ సందర్భంగా ఆయన గణాంకాలతో వివరించారు.హైదరాబాద్‌లోని సబర్బన్ స్టేషన్ల రూపురేఖలను మార్చడమే ధ్యేయంగా కేంద్రం నిధులు కేటాయిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఉప్పుగూడ, మలక్‌పేట వంటి స్టేషన్లలో కేవలం ప్లాట్‌ఫారాల పొడిగింపు మాత్రమే కాకుండా.. ఆధునిక వెయిటింగ్ హాళ్లు, మెరుగైన లైటింగ్ వ్యవస్థ, ఎస్కలేటర్లు, లిఫ్టులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు, సుందరమైన స్టేషన్ ముఖద్వారాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి ద్వారా స్థానిక ప్రాంతాల్లో వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని, డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తయితే భాగ్యనగర ప్రజలకు అత్యుత్తమ ప్రయాణ అనుభూతి లభిస్తుందని మంత్రి వెల్లడించారు.