ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టిడ్కో ఇళ్లను శివారు ప్రాంతాల్లో నిర్మించకుండా పట్టణాలు, నగరాలకు దగ్గరగానే నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. టిడ్కో ఇళ్లను తక్కువ విస్తీర్ణంలోనే నిర్మించి ఎక్కువమందికి పంపిణీ చేసేలా కొత్తగా ప్లాన్ చేసింది. అందుకే టిడ్కో ఇళ్లను జీ+8 తరహాలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. జీ+8 కావడంతో లిఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏపీ అధికారులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లో టిడ్కో ఇళ్ల నిర్మాణ తీరును పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్ట్ అందించారు. ముందుగా రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో జీ+8 తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ముందుగా పదివేల ఇళ్లను నిర్మించేలా స్థలాన్ని సేకరించనున్నారు.వాస్తవానికి టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో భూములకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలకు దూరంగా ఎక్కువ మొత్తంలో స్థలం దొరకుతుంది.. అందుకే దూరంగా వెళ్లి నిర్మాణాలు చేయాల్సి వస్తోంది. అయితే టిడ్కో ఇళ్లు ఊరికి దూరంగా ఉండటంతోఅక్కడ ఉపాధి దొరక్క లబ్ధిదారులు ఉండేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది.. ఊరికి దూరంగా కాకుండా.. ప్రత్యామ్నాయంగా తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. నగర, పట్టణ ప్రాంత పరిసరాల్లోనే జీ+8 టిడ్కో ఇళ్ల సముదాయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.. ఇలా చేస్తే భూసేకరణకు ప్రభుత్వంపై పడే భారం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రజలకు పట్టణాలు, నగరాలకు దగ్గరలోనే నిర్మాణాలు అందుబాటులోకి వస్తే ఎక్కువమంది లబ్ధిదారులు అక్కడ ఉండేందుకు మొగ్గుచూపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో సుమారు 12 లక్షల మంది అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. రాష్ట్ర గృహనిర్మాణసంస్థ వీరి వివరాలతో టిడ్కో ఇళ్లు మంజూరైన వారి వివరాలతో పోల్చి చూశారు.. ఆరు దశల్లో తనిఖీ చేశారు.. ఈ 12 లక్షల్లో 7 లక్షల మంది అర్హులున్నారని ప్రాథమికంగా అంచనా వేశారు. పేదలు, మురికివాడల్లో ఎంతమంది ఉన్నారో వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ జీ+8 టిడ్కో ఇళ్లకు సంబంధించి స్పష్టత రానుంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా ప్లాన్ చేసింది.