తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల.. ర్యాంకులు తెలుసుకోండిలా..

Wait 5 sec.

2026: తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అధికారులు ఈ ఫలితాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన బటన్ నొక్కి ఫలితాలను, విద్యార్థుల సాధించిన ర్యాంకులను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన ఎం. రిషి ఫస్ట్ ర్యాంకు, హైదరాబాద్ మూసాపేటకు చెందిన అన్షు రెండో ర్యాంకు , కడపకు చెందిన వంశీధర్ రెడ్డి మూడో ర్యాంకు సాధించినట్లు అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో మెుత్తం 2,10,766 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా.. 1,97,241 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 90,977 మంది దరఖాస్తు చేసుకోగా.. 84,954 మంది పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షల్లో విద్యాశాఖ ఒక అరుదైన రికార్డును సృష్టించింది. పరీక్షలు ముగిసిన కేవలం ఆరో రోజే తుది ఫలితాలను, ర్యాంకులను ప్రకటించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని (CBT) మరింత ఆధునికీకరిస్తూ.. ఈ ఏడాది విద్యార్థులు పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా వారి మార్కులు కంప్యూటర్‌ స్క్రీన్‌పైనే కనిపించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ డిజిటల్ సంస్కరణల కారణంగానే ఎలాంటి ఆలస్యం లేకుండా.. అత్యంత పారదర్శకంగా, రికార్డు కాలంలో ఫలితాలు విడుదల చేసినట్లు ఎప్‌సెట్ కన్వీనర్‌ ఆచార్య కె. విజయకుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ అయిన ద్వారా తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు సూచించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాలలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఫలితాలు వెల్లడి కావడంతో తదుపరి విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి వచ్చే రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది.