తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా తనదైన నటనతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ .. ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. ఆదరించేవారు లేక, చేతిలో డబ్బులేక తన కూతురుతో కలిసి ఓ ఫౌండేషన్ లో తలదాచుకుంటున్నారు. ఇటీవల ఆమె నడిరోడ్డుపై దీనస్థితిలో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న పావలా శ్యామల, ఆమె కుమార్తె చికిత్స నిమిత్తం శనివారం కూకట్‌ పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లకు సంబంధించిన కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా, వారిని ఆసుపత్రిలో జాయిన్ చేసుకోలేదు. దీంతో క్యాబ్ డ్రైవర్ వారిని ఎక్కడకు తీసుకెళ్ళాలో తెలియక, నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పావలా శ్యామల, ఆమె కుమార్తెలను ఆర్కే ఫౌండేషన్ కి తరలించారు. శ్యామల నడిరోడ్డుపై దిక్కులేని స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి.పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆమెకు అండగా నిలిచి తన మంచి మనసు చాటుకున్నారు. ఆమెకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు తన వ్యక్తిగత బృందాన్ని రంగంలోకి దించారు. దిల్ రాజు టీమ్ సభ్యుడు శేషగిరిరావు వెంటనే కూకట్‌పల్లి ప్రసాద్ హాస్పిటల్‌కు చేరుకుని, వైద్యులతో మాట్లాడి పావలా శ్యామలను ఆసుపత్రిలో చేర్పించారు.ప్రస్తుతం నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై దిల్ రాజు బృందం స్పష్టత ఇచ్చింది. వయోభారంతో కూడిన కొన్ని సాధారణ సమస్యలు తప్ప, ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. ఆమెకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలను పూర్తి చేయిస్తున్నామని, ఆసుపత్రి ఖర్చులతో పాటు వారు నివసించడానికి ఒక గదిని, అవసరమైన సదుపాయాలను కూడా దిల్ రాజు సమకూరుస్తున్నట్లు టీమ్ తెలిపింది.కన్నీటి పర్యంతమైన పావలా శ్యామల...కష్టసమయంలో వచ్చి ఆదుకున్న నిర్మాత దిల్ రాజుకు పావలా శ్యామల, ఆమె కుమార్తె కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. "ఏ ఇంటర్వ్యూలోనైనా మా అమ్మ దిల్ రాజు గారిని నమ్ముకుంది.. ఆయన పెద్ద మనసుతో మా కష్టాన్ని తీర్చారు" అని శ్యామల కుమార్తె భావోద్వేగానికి లోనయ్యారు. నెటిజన్లు కూడా దిల్ రాజు చేసిన ఈ తక్షణ సాయాన్ని అభినందిస్తూ, నిజంగానే దిల్ ఉన్న రాజు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలోనూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పావలా శ్యామల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే.