తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. బండి భగీరథ్‌ను ఆయన కుటుంబసభ్యులు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌‌ను విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం విచారణకు హాజరవుతానని చెప్పిన బండి భగీరథ్.. విచారణకు హాజరు కాలేదు. మరోవైపు బండి భగీరథ్‌ దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. అతడి కోసం ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం బండి భగీరథ్‌ను అతని కుటుంబసభ్యులు పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. మేడ్చల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట బాధితురాలితో పాటుగా ఆమె తల్లి వాంగ్మూలం 40 నిమిషాల పాటు నమోదు చేశారు. ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలాలను పోలీసులు ఇప్పటికే రెండుసార్లు నమోదు చేశారు. బండి సంజయ్ స్పందన.. మరోవైపు చట్టంపై గౌరవం, నమ్మకంతోనే బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్‌ తెలిపారు. న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించినట్లు తెలిపారు. చట్టం ముందు తన బిడ్డ అయినా, సామాన్యుడైనా సమానమేనన్న బండి సంజయ్.. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని బండి భగీరథ్ చెప్తున్నట్లు బండి సంజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.