కేంద్రం సంచలన నిర్ణయం.. వెండి దిగుమతులపై కఠిన ఆంక్షలు

Wait 5 sec.

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియా సంక్షోభం వేళ ఇటీవల బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్రం విధించింది. స్వేచ్ఛా దిగుమతి జాబితా నుంచి తొలగించి.. నియంత్రిత దిగుమతి కేటగిరీలోకి వెండిని చేర్చింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఫారిన్ ట్రేడ్ డైరెక్టరేట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంక్షల విభాగంలోని వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కొన్ని ఉత్పత్తుల విషయంలో ఆర్బీఐ నిబంధనలు కూడా వర్తిస్తాయి. దేశంలో పెరుగుతున్న బంగారం, వెండి దిగుమతి ఖర్చులను నియంత్రించడం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విదేశీ మారకపు నిల్వలను పొదుపుగా వాడుకునేందుకు వీలుగా ఏడాది పాటు బంగారం కొనుగోలు ఆపేయాలని ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. వీటి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచింది. తాజాగా వెండి దిగుమతిపై ఆంక్షలు విధించడం గమనార్హం.అటు, బంగారం దిగుమతుల విషయంలో కూడా కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అడ్వాన్స్ ఆథరైజేషన్ కింద ఒక్కో లైసెన్సు ద్వారా బంగారం 100 కిలోల వరకు మాత్రమే దిగుమతికి అనుమతి ఉంటుంది. అలాగే, కొత్తగా దరఖాస్తు చేసుకునే సంస్థలు తయారీ యూనిట్లను భౌతికంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతులు మంజూరవుతాయి. అంతేకాదు, ఇప్పటికే ఎగుమతి లైసెన్సులు పొందినవారిపై కూడా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. పాత లైసెన్సులతో కనీసం 50 శాతం ఎగుమతులు అయిన తర్వాతే కొత్త అనుమతులు జారీ చేయనున్నారు. అదనపు సుంకం లేకుండా బంగారం దిగుమతి చేసుకునే వ్యాపార సంస్థలు రెండు వారాలకు ఒకసారిరి చార్టర్డ్ అకౌంటెంట్ పరిశీలించిన దిగుమతి-ఎగుమతి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. దిగుమతుల పరిమాణం తగ్గినప్పటికీ 2025-26లో భారత్ బంగారు దిగుమతులు 24 శాతానికి పైగా పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కఠినమైన నిబంధనలు వచ్చాయి. భారత్ బంగారు దిగుమతులకు స్విట్జర్లాండ్ అతిపెద్ద కేంద్రం కాగా.. దాని తర్వాతి స్థానాల్లో యూఏఈ, దక్షిణాఫ్రికా ఉన్నాయి.