TDP MLA వీడియోను ట్వీట్ చేసిన రోజా.. NDAకు కొత్త మీనింగ్, నగరి నియోజకవర్గానికి లింక్ చేస్తూ

Wait 5 sec.

మాజీ మంత్రి రోజా టీడీపీ ఎమ్మెల్యే వీడియోను ట్వీట్ చేశారు. కూటమి పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేనే అక్రమాలు జరుగుతున్నాయని చెబుతున్నారంటూ.. రెండు రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయని రోజా స్పందించారు. 'మా నియోజకవర్గాల్లో ట్రాక్టర్లు కనిపిస్తే కథనాలు.. మరి చంద్రగిరి, నగరిలో జరుగుతున్న వాటిపై ఎందుకు రాయడం లేదు?' అంటూ ఎమ్మెల్యే బహిరంగంగానే ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. 'ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏంటంటే.. #NDA అంటే #NagariDopidiAlliance ఆ?.. ఇసుక, మట్టి అక్రమ రవాణాపై సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేల బహిరంగ మాటలే వైరల్ అవుతున్నాయి' అంటూ రోజా ట్వీట్ చేశారు.రెండు రోజుల క్రితం చిత్తూరుజిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుల్ని ఎదగనివ్వండి.. ఇన్నాళ్లూ మమ్మల్ని అణగదొక్కారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలోనే మట్టి అక్రమరవాణా జరుగుతోందా.. చంద్రగిరి, నగరిలో కూడా తరలిపోతోంది కదా అంటూ ప్రశ్నించారు. తాను అక్రమంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదని.. డాక్టర్ అయిన తాను వైద్యవృత్తిలో బాగానే సంపాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాంటిది తాను మట్టిని అక్రమ రవాణా చేసి సంపాదించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేట్ సర్వే సంస్థలు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తున్నాయని.. ఆ సంస్థలకు రూ.5లక్షలు ఇస్తే మంచి ర్యాంకు ఇస్తారని ఎమ్మెల్యే థామస్‌ చెప్పుకొచ్చారు. గత 30 ఏళ్లలో గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదని.. తనపై, చంద్రబాబు, లోకేష్‌పై నమ్మకంతోనే ఓటర్లు గెలిపించారన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే థామస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడినన్న కారణంతోనే ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్‌లో తనను వెనక్కి నెట్టారన్నారు. తాను ఎస్సీ కాకుండా వేరే కులం ఎమ్మెల్యేనై ఉంటే ఫస్ట్‌ ర్యాంకు వచ్చేదని బాంబ్ పేల్చారు. ర్యాంకుల కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని కూడా ఆరోపించారు.. ఆ డబ్బులు ఇవ్వలేక తాను ఇవ్వలేకనే చివరి స్థానంలో ఉన్నానని వ్యాఖ్యలు చేశారు. ఎస్సీలను చులకన భావంతోనే చూస్తున్నారని.. తనకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.