Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం కేంద్రం సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంలో కీలక ముందడుగుపడింది. కేంద్రం ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. 5 ప్యాకేజీలను 2 ప్యాకేజీలుగా కుదించి వేర్వేరుగా ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రీజినల్ రింగ్ రోడ్డు మొత్తం 161.518 కిలోమీటర్లు ఆరు వరుసలుగా రూ.9,362.4 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ రీజినల్ రింగ్ రోడ్డు టెండర్లకు సంబంధించి జులై 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు గడువు ఉంది.. ఆలోపు ఆన్‌లైన్‌లో బిడ్‌లను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆ మరుసటి రోజు (జులై 8)న బిడ్‌లు తెరుస్తారు. డిజైన్, బిల్ట్, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన ఈ ఆర్ఆర్ఆర్ పనులు చేపట్టాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ ఆర్ఆర్ఆర్ సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌‌లో మొదలై.. యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్‌పల్లి దగ్గర ముగుస్తుంది. ప్యాకేజీ 1లో 83.518 కిలోమీటర్లు పొడవున సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ వరకు రూ.4,918.71 కోట్లు వ్యయంగా అంచనా వేస్తున్నారు. ప్యాకేజీ 2లో మొత్తం 78 కిలోమీటర్లు కాగా.. రూ.4,443.69 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే ప్యాకేజీ-1, ప్యాకేజీ-2లో భూమిని సేకరించారు. ఈ RRRలో 9చోట్ల నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు కనెక్ట్ అవుతాయి. 9 టోల్‌ప్లాజాలాు, 44 పెద్ద బ్రిడ్జిలు, 127 చిన్న బ్రిడ్జిలు, 44 అండర్ పాస్‌లు, 4 ఆర్వోబీలు రానున్నాయి. గత రెండేళ్లుగా ఆర్ఆర్ఆఱ్ ఉత్తర భాగం పనులు వాయిదాపడుతున్నాయి. 2024 డిసెంబర్‌లో రీజినల్ రింగ్ రోడ్డును 4 వరుసలుగా ఐదు ప్యాకేజీలలో నిర్మించేందుకు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు సంబంధించి గతేడాది నవంబరు నెలలో ఆరు వరుసలుగా ఐదు ప్యాకేజీలుగా విభజించి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాలతో బిడ్‌లు దాఖలు కాలేదు. ఎన్‌హెచ్‌ఏఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తరభాగం పనులను రెండు ప్యాకేజీలకు కుదించింది. అలాగే ఆర్ఆర్ఆర్‌కు ఎన్‌హెచ్‌-161ఏఏ నంబరు కూడా కేటాయించారు. తాజాగా రెండు ప్యాకేజీలుగా మార్చి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ బిడ్‌లు తెరిచిన టెండర్‌ ఖరారు చేసిన తర్వాత లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ అందిన మూడేళ్లలో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్నీ కుదిరితే 2029నాటికి ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి టెండర్లు ప్రక్రియ మొదలైంది.