Hyderabad Data Centre: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న భారీ డేటా సెంటర్‌ను ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తమ అతిపెద్ద డేటా సెంటర్‌ను కొన్ని నెలల్లోనే అందుబాటులోకి తెస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ ఓ కార్యక్రమంలో తెలిపారు. దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులకు గిరాకీ పెరుగుతున్న క్రమంలో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ అందిస్తున్న అజూర్ క్లౌడ్ సేవలు, కోపైలేట్ 365 ఏఐ అసిస్టెంట్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడిప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందున్న ఐటీ మార్కెట్లలో భారత్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ 100 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇక్కడ నిపుణుల లభ్యతా అధికంగా ఉంది. ఈ క్రమంలోనే గత ఏడాది చివరిలో మైక్రోసాఫ్ట్ రూ.1.45 లక్షల కోట్ల భారీ పెట్టుబడి ప్లాన్ వెల్లడించింది. ఇందులో అధిక మొత్తం హైదరాబాద్‌లోని డేటా సెంటర్ల కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీకి చెన్నై, పుణే, ముంబైలలో డేటా సెంటర్లున్నా హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న డేటా కేంద్రాల సముదాయం అన్నింటికన్నా అతి పెద్దదిగా నిలుస్తుంది. దేశంలో కొత్తగా అమలులోకి వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా సెక్యూరిటీ యాక్ట్ రూల్స్ ప్రకారం యూజర్ల డేటాను స్థానిక సర్వర్లలోనే భద్రపరచడం తప్పనిసరి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ రూల్స్ అమలుకు ఎంతో కీలకంగా మారనుంది. గూగుల్, అమెజాన్ వంటి కంపెనీల నుంచి గట్టి పోటీ ఉన్నా మౌలిక వసతుల కల్పనలో తాము ఎంతో ముందున్నామని చందోక్ తెలిపారు. షాద్‌నగర్ సహా ఆ 2 ప్రాంతాల్లో..భూమిని తమ డేటా సెంటర్ల సముదాయం కోసం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఆయా ప్రాంతాల్లో డేటా సెంటర్లను నిర్మిస్తోంది. వీటితో పాటుగా సమీపంలోని నందిగామ, కొత్తూర్ ప్రాంతాల్లోనూ భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం. మరోవైపు దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తో పాటు కాగ్నిజెంట్ వంటివి మైక్రోసాఫ్ట్ ఏఐ సేవలను భారీగా వినియోగిస్తున్నాయి. ఈ కంపెనీలు ఒక్కోటి దాదాపు 50 వేలకు పైగా కోపైలెట్ లైసెన్సులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మౌలిక వసతుల అవసరం మరింత పెరిగింది.