APY Pension Scheme: సామాన్య ప్రజలకు సైతం సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందిస్తోంది. ఈ పింఛను పథకానికి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో చేరిన వినియోగదారుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 10 కోట్ల మైలురాయిని అధిగమించనుంది. 18 శాతం వార్షిక వృద్ధితో ఇది సాధ్యం కానుందని, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ అయిన పీఎఫ్ఆర్‌డీఏ (PFRDA) ఛైర్మన్ ఎస్ రామన్ పేర్కొన్నారు. 18- 25 ఏళ్ల వయసు వారిలో ఎక్కవగా ఈ పథకంపై ఆసక్తి కనిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రజలు, ముఖ్యంగా యువత దీర్ఘకాల ఆర్థిక భద్రతపై యువత దృష్టి సారిస్తున్నారని పీఎఫ్ఆర్‌డీఏ ఛైర్మన్ పేర్కొన్నారు. దేశంలో పెన్షన్ పై అవగాహన పెరిగేందుకు మరింతగా చందాదారులకు చేరువ కావాలని సూచించారు. అటల్ పెన్షన్ యోజనలో చందాదారుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 8.96 కోట్లుగా ఉండగా అది 2024- 25 సంవత్సరంలోని 7.61 కోట్ల మంది కంటే 7.61 శాతం అధికం కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఏపీవై పథకంలో 9.04 కోట్ల మంది చేరినట్లు గణాంకాలు వెల్లడించారు. ఇది 18 శాతం వృద్ధితో దూసుకెళ్తోందని. ఈ ఆర్థిక సంవత్సరం 2026-27 ముగింపు నాటికి 10 కోట్ల మైలురాయిని దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. రూ.1000, రూ.2000,రూ.3000, రూ.4000, రూ.5000 చొప్పున కనీస పెన్షన్ వస్తుంది. అయితే ఎక్కువ మంది రూ.1000 పైనే దృష్టి పెడుతున్నారని, బ్యాంకులు వీరిని అధిక పెన్షన్ వైపు మళ్లేలా చూడాలని ఆర్థఇక కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. 20- 30 ఏళ్ల తర్వాత నెలకు రూ.1000 వారికి సామాజిక భద్రత ఎలా లభిస్తుందని ప్రశ్నించారు. బ్యాంకులు ఆ దిశగా ఆలోచన చేయాలని, కస్టమర్లను ప్రోత్సహించాలని సూచించారు. ఎవరు అర్హులు, ఎలా చేరాలి?బ్యాంక్ అకౌంట్ కలిగిన భారతీయ పౌరులు 18 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసులోపు వారు ఈ పథకంలో చేరవచ్చు. 2022, అక్టోబర్ 1 నుంచి ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పథకానికి అర్హులు కాదు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నుంచి జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచే ఆటోమేటిక్ డెబిట్ ద్వారా ఈ పథకంలో డబ్బులు చెల్లించవచ్చు. కనీస పెన్షన్ రూ.1000 రావాలంటే 18ఏళ్ల వ్యక్తి నెలకు రూ.42 కట్టాలి. ఇక 40 ఏళ్ల వ్యక్తి చేరితే నెలకు రూ. 291 చెల్లించాలి. అదే రూ.5000 పెన్షన్ కావాలంటే 18 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.210, 40 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.1454 మేర చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ పథకంలో చేరిన వ్యక్తి 60 ఏళ్లు రాకముందే మరణిస్తే అతడి జీవిత భాగస్వామి కంటిన్యూ చేయవచ్చు. ఆ తర్వాత ఆమెకు పెన్షన్ లభిస్తుంది. ఇద్దరు చనిపోయిన తర్వాత నామినీకి పెన్షన్ కార్పస్ మొత్తం ఇస్తారు. అంటే ఇతర పెన్షన్ స్కీమ్స్ మాదిరిగా కాకుండా ఇందులో చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి ఇస్తారు. ఇరువురికి పెన్షన్ లభిస్తుంది.