హైదరాబాద్‌ వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈనెల 22న జరగనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు నగరంలో ఊహించని డిమాండ్ ఏర్పడింది. విరాట్ కోహ్లీ, అభిషేక్, క్లాసెన్, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్ల మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనే అభిమానుల ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని.. సైబర్‌ కేటుగాళ్లు నకిలీ యాప్‌లు, మోసపూరిత వెబ్‌సైట్ల ద్వారా పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ క్రికెట్ ప్రియులకు హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రస్తుతం ఫేస్‌బుక్, ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ఆకర్షణీయమైన ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్‌ యాప్‌ను అచ్చం పోలిన రంగులు, లోగోలు, డిజైన్లతో కూడిన నకిలీ యాప్‌లు, క్లోన్ వెబ్‌సైట్లను ఈ కేటుగాళ్లు సృష్టించారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా అనధికారిక ఏపీకే ఫైల్స్ ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకునేలా లింకులు పంపుతున్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చునని పైగా తక్కువ ధరకే ప్రీమియం స్టాండ్ టికెట్లు ఇస్తామంటూ భారీ ఆఫర్లతో అమాయక క్రికెట్ ప్రియులను ఊరిస్తున్నారు.ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌లో ఈ మోసాల వెనుక ఉన్న అసలు రంగును బయటపెడుతూ హెచ్చరికలు జారీ చేశారు. 'ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్‌ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్‌ యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. అచ్చం అసలు యాప్‌ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయం. పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా.. మీ బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ నేరగాళ్ల పరమయ్యే ప్రమాదం ఉంది. మ్యాచ్‌ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దు. ఇలాంటి ఫేక్ యాప్‌లు, వెబ్‌సైట్స్ పట్ల నిఘా ఉంచాం. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మీ కష్టార్జితాన్ని కేటుగాళ్ల పాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ ప్రియులకు విజ్ఞప్తి చేస్తున్నాం.' అని సజ్జనార్ ట్వీట్ చేశారు. మ్యాచ్‌ చూడాలనే మితిమీరిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను, బ్లాక్ మార్కెట్ టికెట్ల ప్రకటనలను నమ్మి ఎవరూ మోసపోవద్దని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఫేక్ యాప్స్, అనుమానాస్పద వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు లేదా నకిలీ వెబ్‌సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 1930 నంబర్ ద్వారా లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.