ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ మండల పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద తీవ్రతకు మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కాకినాడ రూరల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కొందరు కూలీలు నిత్యంలాగే శనివారం ఉదయాన్నే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో పాల్గొనేందుకు ఇళ్ల నుంచి బయలుదేరారు. వీరంతా కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో కాకినాడ వైపు నుంచి అత్యంత వేగంతో, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ.. రోడ్డు పక్కన నడుస్తున్న కూలీలపైకి ఒక్కసారిగా దూసుకెళ్లి ఢీకొట్టింది. లారీ వేగం ఎంత ఎక్కువగా ఉందంటే.. లారీ దూసుకొచ్చిన వేగానికి కూలీలు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడి రక్తస్రావం ఎక్కువ కావడంతో వారు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు కూలీలు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కూలీలను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.మరోవైపు.. ఇంటి నుంచి పని కోసమని వెళ్లిన తమ వారు గంట తిరక్కుండానే శవాలుగా మారారనే వార్త విని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాల వద్ద వారి రోదనలు చూసేవారిని సైతం కంటతడి పెట్టించాయి. కాకినాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.