: తమిళనాడు రాజకీయ వేదికపై సనాతన ధర్మం అంశం మరోసారి తీవ్ర అగ్గిరాజేస్తోంది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, ఇటీవల కొత్తగా ఎన్నికైన తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే) పార్టీ ఎమ్మెల్యే వీఎస్ ముస్తఫా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగిన ఆమె.. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసమే మెజారిటీ హిందువుల నమ్మకాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు.మత వివక్షపై ఖుష్బూ సూటి ప్రశ్నలు..ఖుష్బూ సుందర్ ఈ వివాదంపై స్పందిస్తూ సరికొత్త చర్చకు తెరలేపారు. "ఇతర మతాల లాగే సనాతన ధర్మం అనేది కూడా ఒక పవిత్రమైన జీవన విధానం. పుట్టుకతో ఒక ముస్లిం అయిన నేను.. అసంబద్ధంగా ఉన్నాయని, వాటిని పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తే ఈ నేతలు అంగీకరిస్తారా? క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే తమిళనాడు ముఖ్యమంత్రి ఊరుకుంటారా? కేవలం హిందూ మతాన్ని టార్గెట్ చేయడం ఫ్యాషన్‌గా మారింది" అంటూ ఘాటుగా ప్రశ్నించారు.ఉదయనిధి స్టాలిన్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలుసనాతన ధర్మంపై నిరంతరం విషం కక్కే ఉదయనిధి స్టాలిన్ వైఖరిని ఆమె తీవ్రంగా ఎండగట్టారు. "ఉదయనిధికి హిందూమతం అంటే అంతగా అలర్జీ ఉంటే.. మొదట ఆయన తన ఇంట్లోని మహిళలను నియంత్రించాలి. ఆయన తల్లి, అత్తలు,ఆయన మాజీ మంత్రివర్గంలోని మహిళా సహచరులు నుదుటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, నిత్యం హిందూ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. వారిని గుడులకు వెళ్లొద్దని, తాము హిందువులం కాదని ప్రకటించుకోమని చెప్పే ధైర్యం ఉదయనిధికి ఉందా?" అని ఖుష్బూ నిలదీశారు. అలాగే విపక్ష నేతలకు మైనారిటీ వర్గాల తప్పులను వేలెత్తి చూపించే దమ్ముందా అని ప్రశ్నించారు.సీఎం విజయ్‌కు పదునైన హెచ్చరిక..ఇటీవలే అధికారం చేపట్టిన తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను ఉద్దేశించి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు చేశారు. "కొత్తగా గెలిచిన ఉత్సాహంలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్న మీ ఎమ్మెల్యేల నోళ్లకు తాళం వేయాల్సిందిగా సీఎం విజయ్‌ను కోరుతున్నాను. సనాతన ధర్మం, హిందూమతం ఎల్లప్పుడూ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాయి. సమానత్వాన్ని నమ్ముతాయి. పదవిలోకి రాగానే మతపరమైన విభజన తీసుకు రావద్దు. మీరు డీఎంకే దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నారనే విషయం అర్థమవుతూనే ఉంది. అయినప్పటికీ.. ప్రజలు మీ నుంచి మెరుగైన పరిపాలనను ఆశిస్తున్నారు" అని లేఖలో పేర్కొన్నారు.