వెండితెరపై నవ్వించిన నటికి నిజజీవితంలో కన్నీళ్లు.. ఫుట్‌పాత్‌పై కదల్లేని దీనస్థితిలో నటి పావలా శ్యామల

Wait 5 sec.

తెలుగు వెండితెరపై దాదాపు 300కు పైగా చిత్రాల్లో తనదైన విలక్షణ నటనతో, హాస్యంతో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన నిజజీవితం ఇప్పుడు కన్నీటి గాథగా మారింది. వృద్ధాప్యం, దానికి తోడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కనీసం అత్యవసర వైద్యం చేయించుకోవడానికి కూడా పైసా లేక నడిరోడ్డుపై నిస్సహాయ స్థితిలో పడి ఉండటం సామాన్య ప్రజలతో పాటు సినీ అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. గ్లామర్ ప్రపంచంగా పిలిచే టాలీవుడ్ వెనుక ఉన్న చీకటి కోణాన్ని ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసింది.గత కొంతకాలంగా తీవ్ర గుండె సంబంధిత సమస్యలు, వృద్ధాప్య భారంతో బాధపడుతున్న పావలా శ్యామలకు శుక్రవారం (మే 15) రాత్రి ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆమె అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఒక ప్రముఖ కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే.. ఆమె వద్ద వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధురాలనే విచక్షణ కూడా లేకుండా.. ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించింది. అంతటితో ఆగకుండా ఆమెను ఒక ప్రైవేట్ క్యాబ్ ఎక్కించి ఆసుపత్రి నుంచి బలవంతంగా పంపించివేసింది.ఆసుపత్రి యాజమాన్యం కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే.. ఆ క్యాబ్ డ్రైవర్ మరింత దారుణానికి ఒడిగట్టాడు. అర్ధరాత్రి సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కూకట్‌పల్లిలోని ఒక ప్రధాన జంక్షన్ వద్దకు రాగానే శ్యామలను రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై దించేసి నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళిపోయాడు. కటిక చీకటిలో, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ.. నడవలేని స్థితిలో ఉన్న ఆమె ఏం చేయాలో తెలియక గందరగోళ స్థితిలో రోడ్డుపైనే ఉండిపోయారు. తెల్లవారేసరికి ఫుట్‌పాత్‌పై దీన స్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని గమనించిన స్థానికులు, ఆమెను సినీ నటి పావలా శ్యామలగా గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శ్యామల ఉన్న పరిస్థితిని చూసి చలించిపోయారు. మానవత్వంతో స్పందించిన పోలీసులు ఆమెకు ఊరట కల్పించి నిరుపేద వృద్ధులకు ఆశ్రయం కల్పించే ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉన్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ వంటి కొందరు సినీ ప్రముఖులు శ్యామల ఆర్థిక ఇబ్బందుల గురించి తెలిసి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించినప్పటికీ ఆమె దీర్ఘకాలిక ఆరోగ్య అవసరాలకు, నిత్యం వాడే మందుల ఖర్చులకు ఆ డబ్బులు సరిపోలేదు.వెండితెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించిన ఒక సీనియర్ నటి.. జీవిత చరమాంకంలో పైసా లేక ఇలా నడిరోడ్డుపైకి రావడం టాలీవుడ్ చరిత్రలోనే ఒక నల్లటి మచ్చగా మిగిలిపోనుందని సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ MAA పెద్దలు, అలాగే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆమెకు మెరుగైన ఉచిత వైద్య సాయం అందించడంతో పాటు శాశ్వత జీవన భృతి కల్పించాలని సినీ అభిమానులు కోరుతున్నారు.