ఉత్తరాంధ్రలో మొదటిసారి ఎక్స్‌ప్రెస్‌వే తరహా రోడ్డు.. మూడు జిల్లాలను కలుపుతూ హైవే, రూట్ మ్యాప్ ఇదే..!

Wait 5 sec.

ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో రాబోయే 50 ఏళ్ల రవాణా అవసరాలను, జనాభా విస్తరణను దృష్టిలో ఉంచుకుని అనుసంధానిస్తూ సరికొత్త సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన రాంబిల్లి మండలం నుంచి ప్రారంభమై.. విజయనగరం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మొత్తం 102 కిలోమీటర్ల మేర ఈ ప్రతిష్ఠాత్మక రహదారిని నిర్మించనున్నారు.విశాఖపట్నం మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తొలుత నగరం చుట్టూ పూర్తి స్థాయి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని భావించినప్పటికీ స్థానిక కొండలు, సముద్ర తీరం వంటి భౌగోళిక అవరోధాల వల్ల అది సాధ్యం కాదని అధికారులు తేల్చారు. దీనికి ప్రత్యామ్నాయంగా, నగరం వెలుపల ఉన్న మూడు సమీప జిల్లాల పరిధిని కలుపుతూ అర్ధ చంద్రాకృతిలో ఈ సెమీ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టును 4, 6, 8 వరుసల రహదారిగా అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఈ తరహా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు ఇదే మొదటిది కావడం విశేషం.ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును యాక్సెస్ కంట్రోల్డ్ విధానంలో నిర్మిస్తున్నారు. అంటే ఈ రహదారిపైకి సాధారణ రోడ్లలా ఎక్కడపడితే అక్కడ వాహనాలు ప్రవేశించడానికి వీలుండదు. కేవలం ముందుగా నిర్ణయించిన నిర్దేశిత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా.. ప్రమాదాలు లేని సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ () ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ బాధ్యతలను గత డిసెంబర్‌లో ఒక ప్రముఖ కన్సల్టెన్సీకి అప్పగించగా ఈ మే నెలాఖరుకల్లా డీపీఆర్‌ తుది నివేదిక సిద్ధం కానుంది. ఇప్పటికే ట్రాఫిక్ సాంద్రత, సామాజిక, పర్యావరణ ప్రభావాలపై క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తయింది.ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,449 కోట్లుగా లెక్కగట్టారు. కాగా, రహదారి నిర్మాణానికి మొత్తం 12,114 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇందులో సుమారు 8 వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తులదే కావడం గమనార్హం. సాధారణ భూసేకరణ ప్రక్రియ ద్వారా ఆలస్యమైతే అమరావతి తరహాలోనే ఇక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించిన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. వచ్చే జూన్ 15 నాటికల్లా ఈ ప్రాజెక్టు పనులను గ్రౌండ్ లెవెల్‌లో పట్టాలెక్కించాలని అధికారులను ఆదేశించారు.ఈ మెగా సెమీ రింగ్ రోడ్డు మూడు జిల్లాల పరిధిలోని పలు కీలక మండలాల గుండా సాగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం, డెంకాడ, కొత్తవలస, విశాఖపట్నం జిల్లా భీమిలి, పద్మనాభం, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు, చోడవరం, అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం, ఎలమంచిలి, రాంబిల్లి ఈ రహదారి అందుబాటులోకి వస్తే పారిశ్రామిక హబ్‌లైన అచ్యుతాపురం, రాంబిల్లిల నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు సరుకు రవాణా వేగవంతం అవ్వడమే కాకుండా, ఉత్తరాంధ్ర జిల్లాల రూపురేఖలు మారిపోనున్నాయి.