ఆధునిక ప్రపంచానికి ఆధ్యాత్మికత గొప్పదనాన్ని చాటి చెప్పిన గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

Wait 5 sec.

సాంకేతికత మనిషి జీవితాన్ని మెరుగుపరుస్తుంది, కానీ ఆధ్యాత్మికత మాత్రమే మనిషి అంతరంగాన్ని మెరుగుపరుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బెంగళూరులోని ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ ఇంటర్నేషనల్ సెంటర్’లో నిర్వహించిన గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదినం, సంస్థ 45 ఏళ్ల సేవా వారసత్వ వేడుకల్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యుడు సనా సతీష్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులతో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గురుదేవ్‌పై ప్రశంసలు గుప్పించారు. గురుదేవ్‌ను ప్రాచీన భారత జ్ఞానానికి, ఆధునిక ప్రపంచ ఆశయాలకు మధ్య వంతెనగా అభివర్ణించారు. మూడు దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలను నిర్వహించామని.. అవి అద్భుత ఫలితాలను ఇచ్చాయన్నారు. ఏపీని టెక్నాలజీ హబ్‌గానే కాకుండా ఆనందానికి, ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు వేదికగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. తిరుపతి, శ్రీశైలం, సింహాచలంతోపాటు బౌద్ధ వారసత్వ ప్రదేశాలను ప్రస్తావించిన చంద్రబాబు.. ఏపీలోని ప్రతి ప్రాంతం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లోని ఉత్తమ పద్ధతులను రాష్ట్రంలో అమలు చేయాలని గురుదేవ్‌ను కోరిన సీఎం.. కలిసి ప్రపంచానికి ఓ ఆదర్శ నమూనాను సృష్టిద్దామని అన్నారు.భావ్ 2026లో ప్రత్యేక ఆకర్షణగా తెలుగు కళా వైభవం..ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్లుగా సేవలు అందిస్తోన్న సందర్భంగా నెల రోజులపాటు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హాజరయ్యారు. ‘వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్ ఫర్ గ్లోబల్ పీస్’ కార్యక్రమంలో మిలియన్ల మంది ఆన్‌లైన్ ద్వారా భాగమయ్యారు.ఈ వేడుకల్లో భాగంగా మే 6 నుంచి 10వ తేదీ వరకు భావ్ 2026 - ది ఎక్స్‌ప్రెషన్స్ సమ్మిట్ నిర్వహించారు. ఇందులో తెలుగు కళా వైభవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవలే వందో పుట్టిన రోజు జరుపుకున్న పద్మ శ్రీ అన్నవరపు రామస్వామి వయోలిన్ నాదం భక్తులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. విజువల్ ఆర్టిస్టు పూసపాటి పరమేశ్వర్ రాజు కాలిగ్రఫీ ప్రదర్శన సంప్రదాయానికి, ఆధునికతకు వారధిలా నిలిచింది. 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ నాట్య రూపమైన పేరిణి నృత్యంలో నిపుణులైన పేరిణి రాజ్‌కుమార్ నేతృత్వంలోని 108 మంది నర్తకులు చేసిన నాట్య ప్రదర్శన వేడుకలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.2004లో నక్సలైట్ల సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో.. నల్గొండలో ప్రారంభమైన శ్రీ శ్రీ విద్యామందిర్ ఉచిత పాఠశాల ఎందరో అనాథ పిల్లల భవితకు బాసటగా నిలిచింది. ఈ పాఠశాల నేటికీ వందలాది మంది చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. ఇక్కడ అనాథలు, సాయం అవసరమైన పిల్లలకు ఉచిత విద్య, భోజనం, వసతిని అందిస్తున్నారు. అందరికీ దూరమై, ఎనిమిదేళ్ల వయసులో నిస్సహాయ స్థితిలో ఈ విద్యామందిర్‌లో చేరిన లింగస్వామి ఫిజికల్ ట్రైనర్ (పీటీ)గా జీవితంలో స్థిరపడ్డారు. లింగస్వామి లాంటి ఎంతో మంది జీవితాల్లో ఈ సంస్థ వెలుగులు నింపింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు సహాయక చర్యలో పాల్గొని.. అవసరమైన సాయం చేయడంతోపాటు.. బాధితుల మనసుల్లోని భయాలు, ఆందోళనను తగ్గించేలా ట్రామా రిలీఫ్ కార్యక్రమాలను నిర్వహించారు.45 ఏళ్ల ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’..1981లో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రారంభించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ 45 ఏళ్ల కాలంలో 180 దేశాలకు విస్తరించింది. గురుదేవ్ అందించిన ‘సుదర్శన క్రియ’ కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఎంతో మంది జీవితాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ మార్చేసింది. గురుదేవ్ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా.. ఉచిత విద్య, విపత్తు సహాయక చర్యలు, నదుల పునరుజ్జీవనం, సహజ వ్యవసాయం లాంటి సమాజానికి అవసరమైన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. కొలంబియా అంతర్యుద్ధంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్న వేలాది మిలిటెంట్లను ఆయన శాంతి చర్చల ద్వారా లొంగిపోయేలా చేశారు. అయోధ్య రామ మందిర్ - బాబ్రీ మసీదు వివాదంలో హిందు, ముస్లిం మతపెద్దలతో చర్చలు జరిపిన గురుదేవ్.. సామరస్య పరిష్కారం దిశగా అడుగులు పడేలా చేశారు. మెడిటేషన్, సుదర్శన క్రియ లాంటి కార్యక్రమాలతో సమాజంలో మార్పు తీసుకొచ్చారు. వసుధైక కుటుంబం అనే సనాతన భావనను ప్రపంచానికి ఆయన చాటి చెప్పారు.