: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొని ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో.. ఏ స్టాక్ ఎప్పుడు పడిపోతుందో.. ఎంత పడుతుందో.. ఎందుకు పడుతుందో.. కారణాలు కూడా సరిగా తెలియవు. కంపెనీ నుంచి లేదా ఇతర ప్రకటనలు ఏమైనా వచ్చినా వెంటనే రియాక్షన్ కనిపిస్తుంటుంది. ఒక్క ప్రకటనతో షేర్లు భారీగా పడిపోవచ్చు.. అదే ప్రకటనతో పెరగవచ్చు కూడా. అందుకే.. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంటూ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఇక్కడ ఆయా కంపెనీల నుంచి ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, పనితీరు, ప్రణాళికలు, ఒప్పందాలు ఇలా అన్నీ గమనిస్తూ ఉంటూ సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలానే కంపెనీ ఫలితాలు, ప్రకటనలతో భారీగా పడిపోయిన స్టాక్ గురించి చూద్దాం. అదే జర్మన్‌కు చెందిన ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీ.. ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బోష్ లిమిటెడ్. ఇది భారత స్టాక్ ఎక్స్చేంజీల్లోనూ లిస్టింగ్ అయి ఉంది. అయితే గురువారం సెషన్‌లో ఈ స్టాక్ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో షేర్ ధర భారీగా పతనమైంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియగా.. ఇది కూడా షేర్ ధరపై ప్రభావం చూపింది. కిందటి సెషన్‌లో బుధవారం రోజు (మే 20) బోష్ లిమిటెడ్ స్టాక్ ధర రూ. 36,830 వద్ద ముగియగా ఇవాళ (గురువారం) ఆరంభంలో మంచి లాభాల్లోనే రూ. 37,190 వద్ద ఓపెన్ అయింది. అయితే తర్వాత మళ్లీ భారీ పతనంతో ఇంట్రాడేలో ఒక దశలో దాదాపు 5 శాతానికిపైగా పడిపోయి రూ. 34,830 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. ఈ క్రమంలో ఒక్కో షేరు ధర రూ. 2 వేలు తగ్గడం గమనార్హం. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి భారీ నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు. చివరకు 4.66 శాతం నష్టంతో రూ. 35,115 వద్ద స్థిరపడింది.కంపెనీ మార్కెట్ విలువ చూస్తే రూ. 1.04 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 41,945 కాగా.. కనిష్ఠ ధర రూ. 28,610 గా ఉంది. గత కొంత కాలంగా ఈ స్టాక్ ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ స్టాక్ ఇంతలా పతనం అయ్యేందుకు ప్రధాన కారణం.. క్యూ4 ఫలితాలు.. ఫలితాల తర్వాత కంపెనీ చేసిన ప్రకటనలే కారణం. ముందుగా క్యూ4 ఫలితాల్లో అంచనాల్ని అందుకోలేకపోయింది.Bosch Announces Q4 Results:జనవరి- మార్చి త్రైమాసికంలో బోష్ లిమిటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 569 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం చూస్తే 13.3 శాతం పెరిగి రూ. 5,566 కోట్లుగా నమోదైంది. ఇది మార్కెట్ అంచనాల కంటే తక్కువ. ఇంకా ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 270 చొప్పున ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుత అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో.. సప్లై చెయిన్‌లో అంతరాయాలతో ఒత్తిడి పెరిగిందని సంస్థ పేర్కొంది. ఇది కూడా షేర్ ధర భారీగా తగ్గేందుకు కారణంగా నిలిచింది. ఇంకా ఆటోమొబైల్ రంగంలో వాల్యూమ్ గ్రోత్ మందగించడం, ICE నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతుండటం కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇదే ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపర్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.