ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తెలుగుదేశం, వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిప్పికొట్టారు. తాజాగా తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్‌ కల్చర్‌, ఎవరివి హత్యా రాజకీయాలు అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్‌ చేశారు. తన తాత వైఎస్ రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా అని ప్రశ్నించారు. వైసీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు రాష్ట్రంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. హత్యా రాజకీయాలకు తామే బాధితులం అని పేర్కొన్న జగన్.. తమ కుటుంబంలోనే ముగ్గురు బలైపోయారని గుర్తు చేసుకున్నారు. తన తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోయారని.. ఇప్పుడు తమపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. తన తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాజారెడ్డి హత్య జరిగిందని గుర్తు చేశారు. 1999 ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం క్రితం రాజారెడ్డిని చంపేశారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కేవలం పులివెందులకే పరిమితం చేసి.. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్ర కోణంలో భాగంగానే తన తాతను హత్య చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. రాజారెడ్డిని హత్య చేసిన దోషులను హైదరాబాద్‌‌లోని తెలుగుదేశం పార్టీ సెంట్రల్‌ ఆఫీస్, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పెట్టి.. అధికార దుర్వినియోగానికి పాల్పడి మరీ, వారిని రక్షించింది ఎవరని ప్రశ్నించారు. ఈ కేసులో ఎవరిది క్రిమినల్‌ బ్రెయిన్‌.. ఎవరు నిందితులను జైలుకెళ్లకుండా కాపాడారని.. ఎవరిది గొడ్డలి పార్టీ అనేది చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తన తండ్రి వైఎస్సార్ విషయంలోనూ ఇదే జరిగిందని వైఎస్ జగన్ చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అంటూ.. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని.. అలా అన్న తర్వాత 2, 3 రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించినట్లు తెలిపారు. కావాలంటే అసెంబ్లీలో రికార్డ్ అయిన క్లిప్పింగ్‌లు చూడాలని పేర్కొన్నారు. తాము బాధితులమని.. కానీ తిరిగి తమపైనే తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కూడా చంద్రబాబు హయాంలోనే హత్యకు గురయ్యారని.. కానీ తానే హత్య చేశాననని.. టీవీ లైవ్‌ షోల్లో ఆరోపణలు చేసిన దస్తగిరి.. ప్రస్తుతం పోలీసుల అండతో దర్జాగా కార్లలో తిరుగుతున్నాడని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు కేసులో.. దస్తగిరి కేసులో లాయర్‌ లూథ్రానే కావడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయాల్లో లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను కాపాడటం, అమాయకులను హింసించడం జరుగుతోందని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా జరుగుతోంది ఇదేనని తేల్చి చెప్పారు.ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. ఆయనను పరామర్శించేందుకు వెళ్లి.. కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తులు మాట్లాడారని.. మరి ఎవరివి శవ రాజకీయాలు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కుమార్తెను, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. పార్టీని, సీఎం కుర్చీని, పార్టీ గుర్తును లాక్కున్నది చంద్రబాబు కాదా అని నిలదీశారు.