వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీ, తెలంగాణలో లీటర్ ఎంతంటే?

Wait 5 sec.

కేంద్ర ప్రభుత్వం మరోసారి సడెన్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్ రెండింటిపైనా లీటరుపై రూ. 3 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించాయి. పెరిగిన ధరలు మే 15న ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. తెలంగాణలో చూస్తే హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుపై రూ. 3 కుపైనే పెరిగింది. రూ. 110.88 అయింది. డీజిల్ ధర రూ. 98.96 అయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌ ధర రూ. 3.29, డీజిల్ ధర రూ. 3.14 చొప్పున పెరిగింది.దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 3 పెరిగి ఇప్పుడు లీటరుకు రూ. 97.77 గా అయింది. కోల్‌కతాలో రూ. 108.74, చెన్నైలో రూ. 103.67, ముంబైలో రూ. 106.68 గా ఉన్నాయి. డీజిల్ ధరల్ని చూస్తే ఢిల్లీలో రూ. 90.67 గా ఉండగా.. చెన్నైలో రూ. 95.65, ముంబైలో రూ. 93.14, కోల్‌కతాలో రూ. 95.13 గా ఉన్నాయి.పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో.. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం ఎప్పటినుంచో పెంచుతుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే గ్యాస్ రేట్లను పెంచినప్పటికీ.. ఇంధన ధరల్లో మార్పులు చేయలేదు. ఇక్కడ ఇతర చర్యల్ని తీసుకుంటూ వచ్చింది. ఇందులో భాగంగానే.. పెట్రోల్, డీజిల్‌పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తర్వాత చమురు ఎగుమతులపైనా విండ్‌ఫాల్ టాక్స్ మళ్లీ తీసుకొచ్చింది. చాలా రోజులకు ఇప్పుడు చమురు కంపెనీలకు భారీ నష్టాలు వస్తుండటంతో పెంచక తప్పలేదు.