తెలంగాణలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు విలవిల్లాడుతుంటే.. మరోవైపు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గతేడాది మే నెలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4.7 డిగ్రీల మేర అధికంగా ఉండటం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది.ఈ తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 16న అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. మే 17, 18 తేదీల్లో ఈ తీవ్రత మరింత పెరిగి పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు కూడా విస్తరిస్తుందని అధికారులు తెలిపారు. వడగాల్పుల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.మరోవైపు అకాల వర్షాల ముప్పు కూడా పొంచి ఉంది. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో మే 15, 16 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట కోతల సమయంలో ఉన్న రైతులు ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిరంతరం మంచినీరు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని అంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని.. గొడుగు లేదా టోపీని తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎండలో ప్రయాణాలు చేయకపోవడం శ్రేయస్కరమని అంటున్నారు. కళ్లు తిరగడం, అధిక దాహం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అంటున్నారు.