ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇంధన పొదుపు మొదలుపెట్టారు. .. కేవలం నాలుగు వాహనాల్లో మాత్రమే వెళుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అంతేకాదు వారంలో ఒకరోజును నో వెహికల్ డేగా పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే వీలైనంత ఖర్చను తగ్గించాలని ప్లాన్ చేశారు. ఏపీ కేబినెట్‌లో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలపై మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు. ఇంధనం పొదుపు చేయడం మంచిది అంటూనే మరో సలహా ఇచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ డీజిల్, పెట్రోలు వంటి ఇంధన వినియోగాన్ని తగ్గించాలని సదుద్దేశంతో పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు వాహనాలకు, అలాగే మంత్రి నారా లోకేష్ రెండు వాహనాలకు తమ కాన్వాయ్‌ను కుదించుకున్నామన్నారని.. ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే అదే సమయంలో కేవలం రాజకీయ ప్రత్యర్థులైన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడానికి నిర్వహిస్తున్న మహానాడుకు అయ్యే భారీ ఖర్చుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నారు. కాన్వాయ్‌లో వాహనాలను కుదించడం మంచిదే కానీ మహానాడుపై పునరాలోచించాలని రోజా ప్రస్తావించారు. మహానాడుకు వచ్చే వేలాది నాయకుల వాహనాల ఇంధన ఖర్చులు, మంత్రులు, అధికారుల కాన్వాయ్‌ల ఖర్చులు, అక్కడ వినియోగించే జనరేటర్లకు అయ్యే డీజిల్ ఖర్చులు, భారీ స్టేజీలు, ఏర్పాట్లు ఇవన్నీ కలిపి ఎంత ప్రజాధనం, ఎంత ఇంధనం వృథా అవుతుందో లెక్కిస్తే ఆశ్చర్యమేనన్నారు. సాధారణ ప్రజలకు పొదుపు సందేశాలు ఇచ్చే నాయకులు, ఇలాంటి భారీ రాజకీయ ఆర్భాటాల ఖర్చులను కూడా తగ్గించే దిశగా ఆలోచిస్తేనే ఆ పిలుపులకు నిజమైన విలువ ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. అయితే టీడీపీ అధిష్టానం నెల్లూరు నిర్వహించానుకుంటున్న మహానాడు నిర్వహణపై పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో నిర్వహణపై క్లారిటీ వస్తుందంటున్నారు. మహానాడును రద్దు చేయడమా.. జూమ్ ద్వారా నిర్వహించడమా అనేది స్పష్టత ఇవ్వనున్నారు.