తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. 'శేఖర్‌ మాస్టర్‌ vs శేఖర్ మాస్టర్' అంటూ యూట్యూబ్ లో లెక్కలేనన్ని వీడియోలు దర్శనమిచ్చాయి. వీటిపై తాజాగా జానీ స్పందించాడు. తమకు ఎలాంటి గొడవలు లేవని, తమ మధ్య యుద్ధం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై జానీ మాస్టర్, ఆయన భార్య సుమలత సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. జానీ మాట్లాడుతూ.. ''సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ కోసం నాతో పాటుగా శేఖర్ అన్న, పలువురు మాస్టర్స్ వచ్చారు. యూనియన్ లో సమస్యలపై డిస్కషన్ చేశాం. ఆ సమయంలో జరిగిన కొన్ని వీడియోలు తీసుకొని శేఖర్ మాస్టర్ - జానీ మాస్టర్ మధ్య ఘర్షణ జరిగిందని, ఇద్దరు తిట్టుకొని అరుచుకున్నారని, కొట్టుకున్నారని ఏవేవో వార్తలు రాశారు. అదంతా ఫేక్. అలా ఏమీ జరగలేదు. శేఖర్ అన్న చాలామంచి వ్యక్తి. ఆయన ఎప్పటికీ నాకు బ్రదర్. భాను మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి. మా యూనియన్‌, డ్యాన్సర్ల కోసం మేమంతా ముందు నిలబడి పనిచేస్తాం. ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు లేరు. ఇప్పటికిప్పుడు నాకు ఏదైనా ఇబ్బంది అంటే శేఖర్ అన్న పరుగెత్తుకొని వస్తాడు. ఆయనుకు ఇబ్బంది అంటే నేను పరుగెత్తుకొని వెళ్తా'' అని చెప్పారు. ''ఈ వీడియోలు చూసి చిరంజీవి సార్ కూడా కొంచం అప్సెట్ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం నన్ను, శేఖర్ మాస్టర్ ని పిలిస్తే షూటింగ్ దగ్గరకు వెళ్ళాం. చిరంజీవితో కలిసి ఇద్దరం భోజనం కూడా చేశాం. నేను, శేఖర్ మాస్టర్ కలిసి మాట్లాడుకున్నాం. నవ్వుకున్నాం.. హ్యాపీగా సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో నేను, శేఖర్ మాస్టర్ కొట్టుకున్నాం.. మా మధ్య యుద్ధం అనేది చాలా రాంగ్'' అని జానీ మాస్టర్ అన్నారు. చిరంజీవితో కలిసి ఇద్దరు మాస్టర్లు కలిసి భోజనం చేస్తున్న ఫోటోని జానీ మీడియాకి చూపించారు. ''శేఖర్ మాస్టర్ హోం పాటుగా ఇతర మాస్టర్లతో నాకు గొడవలు లేవు. మేమెప్పుడూ ఇలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటాం. మాకు ఫుల్ సపోర్టుగా ఎప్పుడూ చిరంజీవిగారు ఉంటారు. ఆయనే కాదు, ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్‌ మా టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిగారికి థాంక్స్ చెబుతున్నా. ఇండస్ట్రీలో డ్యాన్స్‌ మాస్టర్లు, ఫైటర్లు, డ్యాన్సర్లకు మంచి గుర్తింపు, స్థానం ఉందంటే అందుకు కారణం చిరంజీవి. ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చాం. మళ్లీ చెబుతున్నా, మా డ్యాన్స్‌ మాస్టర్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. యుద్ధాలు లేవు. చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయభేదాలు మాత్రమే. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి చిన్న సమస్యలు ఉంటాయి'' అని జానీ మాస్టర్ అన్నారు.