సోషల్ మీడియా ద్వారా మొదలైన ఓ ప్రేమకథ ఎనిమిదేళ్ల తర్వాత విషాదాంతానికి దారితీసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కోండ్రుపాడుకు చెందిన 26 ఏళ్ల యువతి ఇటీవల ముంబైలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఈ క్రమంలోనే ఆమె రాసిన చివరి లెటర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను చనిపోయిన తర్వాత.. తన ప్రియుడే తన మృతదేహానికి తాళి కట్టాలని.. ఇదే తన చివరి కోరిక అంటూ ఆ యువతి లేఖ రాయగా.. ఆమె కుటుంబ సభ్యులు.. యువతి మృతదేహాన్ని ఆ యువకుడి ఇంటి ముందు వేసి ధర్నాకు దిగారు. అయితే ఆ యువకుడు తన కుటుంబంతో సహా పరారీలో ఉండటం గమనార్హం.యువతి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 8 ఏళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకాశం జిల్లా పొందూరు గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి చాలా కాలం పాటు కొనసాగింది. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ముంబైలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఆ యువతి తన చివరి కోరిక అంటూ రాసిన లేఖ ఇప్పుడు సరికొత్త వివాదానికి కారణం అయింది. తాను ఆ యువకుడిని ఎంతో ప్రేమించానని.. బతికి ఉన్నప్పుడు ఎలాగో అతడితో పెళ్లి చేసుకునే అవకాశం రాలేదని.. కానీ చనిపోయిన తర్వాత అయినా తన కోరికను నెరవేర్చాలని కోరింది. తన శవానికి.. ఆ యువకుడితో తాళి కట్టించాలని కోరింది. దీంతో ఆమె మృతదేహాన్ని ముంబై నుంచి నేరుగా ప్రియుడి స్వగ్రామమైన పొందూరు గ్రామానికి యువతి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. తన కుమార్తె చావుకు కారణమైన యువకుడు కనీసం ఆమె చివరి కోరికను గౌరవించి మృతదేహానికి తాళి కట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే బాధితురాలి కుటుంబం తమ గ్రామానికి వస్తోందన్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు ఇంటి గేటు తాళాలు పగులగొట్టి.. మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచి నిరసన చేపట్టారు. ఈ ఘటనతో పొందూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. యువతి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.