విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. జరిగి ఒకరు మృతి చెందగా.. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. మరీచకోట్‌కు చేరువలో ఈ దుర్ఘటన సంభవించింది. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో అదుపుతప్పి తొక్కిసలాటకు దారితీసినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రులకు తరలించారు. బోడా దండాపై రథం లాగుతుండగా ఈ ఘటన జరిగింది. ఊపిరాడకపోవడంతో ఒక భక్తుడు స్పృహ కోల్పోయినట్లు సమాచారం. అతడిని వెంటనే పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి చేరుకునేసరికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన వారికి అత్యవసర వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి.ఘటనా స్థలంలో ఉన్న పోలీసు సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల దివ్య యాత్రను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గుమిగూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి వివరాలు, ఘటనకు గల కచ్చితమైన కారణం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకున్నారు.